సౌదీలోని భారతీయులను రప్పించండి : ఉమెన్ చాందీ

FILE
సరైన ధ్రువీకరణ పత్రాలు లేని కారణంచేత సౌదీలో దేశ బహిష్కారానికి గురైన ఆయా కేంద్రాలలో మగ్గుతున్న భారతీయులను ఆదుకుని, వారిని వెంటనే వెనక్కి రప్పించే చర్యలు తీసుకోవాలని కేరళ విపక్ష నాయకుడు ఉమెన్ చాందీ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ దేశ బహిష్కార కేంద్రాలలో సరైన సదుపాయాలు లేని కారణంగా వందలాదిమంది భారతీయులు దుర్భర జీవితం గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి ఎస్.ఎం. కృష్ణ, కేంద్ర ప్రవాస వ్యవహారాల శాఖా మంత్రి వాయలార్ రవిలకు ఉమెన్ చాందీ ఓ లేఖ రాశారు. దేశ బహిష్కరణ కేంద్రాలలో గడుపుతున్న భారతీయులు (కేరళ ప్రాంతానికి చెందినవారితో సహా) ఎన్నో వ్యాధులతో సతమతమవుతున్నారనీ, స్వదేశాలకు తిరిగి వచ్చేందుకు వారివద్ద తగినంత డబ్బు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

భారతీయుల దుర్భర పరిస్థితిని అర్థం చేసుకుని, ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, ఉన్నత స్థాయిలో ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఉమెన్ చాందీ ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించారు. అలాగే రియాద్ రాయబార కార్యాలయంలో కేరళ అధికారులను కూడా నియమించాలని చాందీ ఈ లేఖలో కేంద్రాన్ని కోరారు.

వెబ్దునియా పై చదవండి