హనీఫ్ కేసులో పూర్తి అధికారాలు ఇవ్వలేదు : క్లార్క్

FILE
భారతీయ వైద్యుడు మహ్మద్ హనీఫ్ కేసు విచారణలో తనకు పూర్తి అధికారాలు ఇవ్వలేదని న్యూసౌత్‌వేల్స్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాన్ క్లార్క్ ఆరోపించారు. దర్యాప్తు సమయంలో రక్షణ సంస్థలు సమన్వయం లేకుండా పనిచేశాయనీ ఆయన ధ్వజమెత్తారు.

హనీఫ్‌ను అక్రమంగా నిర్బంధించటం వెనుకనున్న రాజకీయ కుట్రను బహిర్గతం చేసేందుకు తనకు పూర్తి అధికారాలు ఇవ్వలేదని జాన్ క్లార్క్ ఆరోపించినట్లు "ద ఏజ్" పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కేసులో తాను మంచి ఫలితం ఆశించాననీ, ఒక అంశంలో మాత్రమే వైఫల్యం చెందానని కామన్వెల్త్ అంబ్సుడ్‌మన్ సమావేశంలో మాట్లాడుతూ క్లార్క్ అన్నట్లు ద ఏజ్ తెలిపింది

ఇమ్మిగ్రేషన్ మాజీ మంత్రి కెడిన్ ఆండ్రూస్ రాజకీయ ఒత్తిడితో హనీఫ్‌ను జైలుపాలు చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. తనకుగనుక పూర్తి అధికారాలు ఇచ్చి ఉన్నట్లయితే హనీఫ్ అరెస్టు వెనుకనున్న రాజకీయ కుట్రను నిగ్గు తేల్చి ఉండేవాడినని క్లార్క్ మండిపడుతున్నాడు.

ఇదిలా ఉంటే... తీవ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో 2007వ సంవత్సరంలో హనీఫ్‌ను ఆస్ట్రేలియా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రెండు దేశాలలో ఈ సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే హనీఫ్‌పై మోపిన ఆరోపణలు రుజువు కాకపోవడంతో అక్కడి ప్రభుత్వం ఇతడిని విడిచిపెట్టింది.

వెబ్దునియా పై చదవండి