అమెరికాలోని శాన్ డీగోలో అవినీతిపై రెండో దండి యాత్ర

సోమవారం, 14 మార్చి 2011 (19:58 IST)
WD
మార్చి12 ఉదయం 8గంటలకు అమెరికాలోని శాన్‌డీగో పట్టణంలో మార్టిన్ లూథర్ కింగ్(జూనియర్) పార్క్ వద్ద ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. 78ఏళ్ల వృద్ధుడు ఒకరు అచ్చం మహాత్మా గాంధీలాగా దుస్తులు ధరించి అక్కడకి చేరుకున్నాడు. ఆయనను అనుసరిస్తూ 30మంది గాంధీకీ పేరు తెచ్చిన దండియాత్ర స్ఫూర్తితో టీ షర్ట్స్‌పై "దండి మార్చి2-ఎ 240మైల్ వాక్ ఎగైనెస్ట్ కరప్షన్‌" అని ముద్రంచుకొని అనుసరించారు.

జాతీయ గీతాన్ని ఆలపించిన తర్వాత పీపుల్ ఫర్ లోక్‌సత్తా సభ్యులు శ్రీహరి అట్లూరి, జవహర్ కంభంపాటి, సుభాష్ కర్రి, వర్మ దంతులూరిలు తమ స్ఫూర్తిని కొనగాగిస్తూ 240 మైళ్లు పూర్తిగా నడిచారు. ఈ మార్చ్‌ను కవర్ చేయటానికి భారత్‌ నుంచి దైనిక్ చత్తీస్‌గఢ్ ఎడిటర్ సునీల్ కుమార్ ప్రత్యేకంగా అమెరికా వచ్చారు. శాన్‌డీగో వీధుల్లో సాగుతున్న వీరితో బోస్టన్ నుంచి వచ్చిన ఒక గ్రూప్ జత కలిసింది.

మార్చి12, 1930న మహాత్మ గాంధీ భారత స్వాతంత్ర్యం కోసం 240మైళ్లు దూరం దండి యాత్ర చేశారు. ప్రస్తుతం అవినీతికి వ్యతిరేకంగా సరిగ్గా అదే రోజు వీరు దండియాత్ర-2 చేశారు. వీరికి మద్దతుగా అనేక మంది భారతీయులు, అనేక సంస్థలు భారత్‌లోని 12నగరాలతో పాటు పలు దేశాలలోని 20 నగరాల్లో చివరి రోజైన మార్చి 26న నడవనున్నారు.

మరోవైపు భారత్‌లో రాజ్‌కుమార్ సింగ్ నేతృత్వంలోని సీనియర్ సిటీజన్స్ బృందం గాంధీజీ నడచిన మార్గంలో పయనించి ఏప్రిల్‌ 6న దండి చేరుకుని ఉప్పు తయారు చేయనున్నారు. వీరి యాత్ర గుజరాత్‌లోని సబర్మతిలో ప్రారంభమయి తీరప్రాంతమైన దండి చేరుకుంటుది.

అలా వారు తయారు చేసిన ఉప్పును చిన్న చిన్న ఫ్యాకట్లలో భారత ఎంపీలందరకి పంపిస్తారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో సుమారు 100మంది ఒకచోట చేరి అమెరికాలో జరుగుతున్న దండియాత్ర-2 విజయం కోసం ప్రార్థించారు.

రెండో రోజు దండియాత్రలో పాల్గొన్నవారి సంఖ్య 80కి చేరింది. ఈ యాత్ర మరో 15రోజులు సాగి మార్చి26న శాన్‌ఫ్రాన్సిక్సోలో జరిగే భారీ కార్యక్రమంతో ముగుస్తుంది.

వెబ్దునియా పై చదవండి