అమెరికాలో పెరుగుతున్న పెళ్లికాని ప్రసాద్‌ల సంఖ్య!!

ఆదివారం, 22 సెప్టెంబరు 2013 (11:11 IST)
File
FILE
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ప్రవాసాంధ్ర యువకులు పలు కీలక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ప్రధానమైనది వివాహం. వయస్సు ముదిరిపోతున్నా సరైన జోడీ దొరక్క దిగాలు పడుతున్నట్టు తానా మాజీ అధ్యక్షుడు, ఇండో - అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్ ప్రసాద్ తోటకూర చెప్పారు.

ఇదే అంశంపై ఆయన ఒక వార్తా పత్రికతో మాట్లాడుతూ అమెరికాలోని అనేక మంది యువత కట్టుబాట్లకు, సంప్రదాయాలకు దూరంగా స్వేచ్ఛాపూరిత వాతావరణంలో పెరుగుతున్నా కల్యాణ ఘడియలు మాత్రం అంతకంతకూ దూరమవుతున్నాయని వాపోతున్నారు.

30 - 35 యేళ్ల వయస్సు దాటిన తర్వాత కూడా చాలా మంది పెళ్లి చేసుకోవటం లేదని, ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమన్నారు. ఇది ప్రవాసాంధ్ర సమాజం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య అన్నారు. అక్కడ పిల్లలు స్వేచ్ఛగా పెరుగుతారు. తమ కులం వారినో, మతం వారినో మాత్రమే పెళ్లి చేసుకోవాలనే కట్టుబాట్లు, కట్నాల సమస్య ఉండవన్నారు.

అయినా చాలా మంది తమకు నచ్చిన వారు దొరకటం లేదంటూ పెళ్లిని ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటున్నారు. దీని కోసం మేము కొన్ని వివాహ పరిచయ వేదికలను నిర్వహించామన్నారు. కేవలం ఐటీ, వైద్యం వంటి రంగాల్లోనే కాక రాజకీయాల్లోనూ రాణించాల్సిన అవసరముందన్నారు. అప్పుడే మనం అమెరికా సమాజంలో ప్రధాన పాత్ర పోషించగలుగుతామని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి