అమెరికా ఎన్నికల్లో ప్రవాసాంధ్రులదే కీలక పాత్ర

FILE
త్వరలో అమెరికాలోని పలు రాష్ట్రాలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రవాసాంధ్రులే కీలకపాత్ర పోషించనున్నారని న్యూజెర్సీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ చివుకుల ఉపేంద్ర అభిప్రాయం వ్యక్తం చేశారు. న్యూజెర్సీలో రెండు రోజులపాటు జరిగిన ఇండో-అమెరికన్ వేడుకల ముగింపు సభలో పాల్గొన్న ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు.

అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో గుజరాతీయుల తరువాత ఆంధ్రులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, అంకెల్లో తీసుకుంటే సుమారు 7 లక్షల పైబడే ఉంటారని ఉపేంద్ర పేర్కొన్నారు. తనతోపాటు మరికొంతమంది ప్రవాసాంధ్రులు రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారని కూడా ఆయన వెల్లడించారు.

ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యూజెర్సీ గవర్నర్ జాన్ కొరిజన్ మాట్లాడుతూ... భారతీయుల సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. న్యూజెర్సీ రాష్ట్రంలో ప్రవాసాంధ్రులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారనీ, ఉపేంద్ర లాంటి మేధావులు అసెంబ్లీకి ఎన్నికవడం గర్వించాల్సిన విషయమని అన్నారు.

వెబ్దునియా పై చదవండి