ఆస్ట్రేలియా దాడులపై శ్యామ్ బెనగల్ ఆగ్రహం

ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై జరిగిన జాత్యంహంకార దాడులను ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ తీవ్రంగా ఖండించారు. కంగారూ నేలపై భారతీయులపై జాతివివక్ష దాడులు కొత్తేమీకాదనీ ఆయన వాపోయారు. ప్రతిభ గల విద్యార్థులను ఆకర్షిస్తున్న ఆ దేశ యూనివర్సిటీలు వారికి తగిన భద్రత కల్పించకపోవడం అన్యాయమని బెనగల్ విమర్శించారు.

ఇప్పటికైన ఆస్ట్రేలియా ప్రభుత్వం మేల్కొని.. భారత విద్యార్థులకు తగిన రక్షణ చర్యలను చేపట్టాలని బెనగల్ డిమాండ్ చేశారు. కాగా... క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ ఇచ్చిన డాక్టరేట్‌ను బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ తిరస్కరించడం సరైన నిర్ణయమేనని ఈ సందర్భంగా ఆయన సమర్థించారు.

ఇదిలా ఉంటే... భారత విద్యార్థులపై జరుగుతున్న జాత్యంహంకార దాడులపై ఒరిస్సా వాసులు కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశాలలో భారత విద్యార్థులపై దాడులను నివారించేందుకు ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని, విద్యార్థుల రక్షణకు తగిన ఏర్పాట్లను చేసేలా ఆస్ట్రేలియాపై ఒత్తిడి తేవాలని వారు కోరుతున్నారు.

వెబ్దునియా పై చదవండి