కృష్ణ చైనా పర్యటన: భారతీయ కుటుంబాలకు ఓదార్పు..!!

PTI
ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ.. అక్కడ పోలీసుల అదుపులో ఉన్న 21 మంది భారతీయ కుటుంబాలను కలిశారు. వజ్రాలు స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా ఆరోపించబడి, పోలీసుల ఇంటరాగేషన్‌ను ఎదుర్కొంటున్న 21 మంది నిందితుల కుటుంబ సభ్యులను కలిసి ఆయన ఊరడించారు. ఈ విషయాన్ని చైనా అధికారులతో చర్చించి, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని ఈ మేరకు కృష్ణ హామీ ఇచ్చారు.

కాగా.. దక్షిణ చైనా సిటీ అయిన షెన్‌జెన్‌లో నివసిస్తున్న 20 మంది ప్రవాస భారతీయులను వజ్రాలు స్మగ్లింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అక్రమంగా సంపాదించిన డబ్బును చెలామణి చేస్తున్నాడంటూ మరో భారతీయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్.ఎం. కృష్ణ బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు.

ఇదిలా ఉంటే.. బాధితులు వెంటనే తమ తమ కుటుంబ సభ్యులను కలవాలని కోరుకుంటున్నారని, వారికి ఆ అవకాశం కల్పించేలా చైనా అధికారులను కలిసి ఏర్పాట్లు చేయాలని చైనాలోని భారత కాన్సులేట్‌ను భారత ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో చైనా ప్రీమియర్ వెన్ జియాబావో మరియు విదేశాంగ మంత్రి యాంగ్ జైచీలతో జరిగే చర్చలలో ఈ విషయాన్ని ప్రస్తావించి, న్యాయం జరిగేలా చూస్తానని కృష్ణ బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా.. కృష్ణ బుధవారం పొద్దుపోయిన తరువాత వెన్, యాంగ్‌లతో సమావేశం కానున్నారు.

వెబ్దునియా పై చదవండి