ఘనంగా ముగిసిన తానా "ఐఐపీ"

FILE
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) హైదరాబాద్ నగరంలో నిర్వహించిన అంతర్జాతీయ యువజన శిక్షణా కార్యక్రమం (ఐఐపీ) విజయవంతంగా ముగిసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. అమెరికాలో స్థిరపడిన తెలుగు కుటుంబాలకు చెందిన ఆరుగురు యువతీ, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తానా పేర్కొంది.

నగరంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఇటీవల జరిగిన ఐఐపీ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్సార్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి డి. శ్రీధర్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తానా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సందర్భంగా తానా ఐఐపీ కో చైర్ ఎమ్వీఎల్ ప్రసాద్ యువతీ యువకులను, వారి తల్లిదండ్రులను ముఖ్యమంత్రికి పరిచయం చేశారు.

తానా కార్య నిర్వహక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు శ్రీధర్ బాబు ముఖ్యమంత్రికి వివరించారు. 41 రోజులపాటు జరిగిన ఐఐపీ కార్యక్రమంలో అమెరికాలో ఉంటున్న తెలుగు యువతకు మన సంస్కృతి, సంప్రదాయాలపట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఐఐపీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాస యువతీ, యువకులకు "తానా ఐఐపీ బ్రాండ్ అంబాసిడర్" అనబడే సర్టిఫికెట్లను వైఎస్సార్ ప్రదానం చేశారు. వారి ఆకాంక్షలు, లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి... తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు.

ఇదిలా ఉంటే... 2007 నుంచి ప్రతి రెండేళ్లకోమారు ఐఐపీ కార్యక్రమాన్ని తానా సంస్థ నిర్వహిస్తోంది. ఈ ఏడాది శిక్షణగానూ యలమంచిలి దివ్య, ఆవుల సాహితి, దగ్గుబాటి లేఖజ, బొందలపాటి సీత కిర్‌స్టిన్, కంభంపాటి రేఖ, చేబ్రోలు పూజ..లు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలను అందించిన కేర్ హాస్పిటల్స్, వేగేశ్న ఫౌండేషన్‌లకు తానా కృతజ్ఞతలు తెలియజేసింది.

వెబ్దునియా పై చదవండి