డల్లాస్‌లో తెలుగు సాహిత్య వేదిక

FILE
డల్లాస్‌లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (టాన్‌టెక్స్) నెల నెలా నిర్వహించే సాహిత్య వేదిక ఆగస్టు 16వ తేదిన అత్యంత వైభవంగా జరిగింది. కవులు, గాయకులు, కళాపోషకులు, సాహిత్యాభిమానులు పెద్ద ఎత్తున హాజరైన ఈ కార్యక్రమానికి కన్నెగంటి చంద్రశేఖర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

స్థానికంగా ఉండే తెలుగు రచయితలు తాము రాసిన కవితలను సాహిత్య వేదికలో చదివి వినిపించగా... గన్నవరపు మూర్తి, పుదూర్ జగదీశ్వరన్, బండ్ల రాగయ్య, అన్నవరపు రంగనాయకులు తదితరులు పలు రకాల పద్యాలను సభికులతో పంచుకున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన రామశాస్త్రిని జయంతి యాజి సాహిత్య వేదిక సభకు పరిచయం చేశారు. పద్య, గద్య కవితల భేదాన్ని తెలుపుతూ సుమతీ శతకం, గజేంద్ర మోక్షంలోని పద్యాలతో రామశాస్త్రి భావయుక్తంగా వివరించటంతో సభ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

ఇంకా ఈ సాహిత్య వేదికకు విశిష్ట అతిథిగా హాజరయిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధానాచార్యులు పర్వతనేని సుబ్బారావును తోటకూర ప్రసాద్ సభకు పరిచయం చేశారు. తెలుగు భాష పుట్టుక, పరిణామక్రమంపై సుబ్బారావు ప్రసంగించారు. తదనంతరం గంటి నిహారిక త్యాగరాజకృతిని, దేవులపల్లి కృష్ణశాస్త్రి గేయాన్ని శ్రావ్యంగా ఆలపించగా.. డాక్టర్ ఆళ్ల శ్రీనివాస్ జయ జయ భారత జననీ, మరియు పలు జానపద గీతాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

వెబ్దునియా పై చదవండి