"తెలుగు వెన్నెల" ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (టాన్‌టెక్స్) ఆధ్వర్యంలో "నెల నెలా తెలుగు వెన్నెల" ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. జూలై 11వ తేదీన డల్లాస్‌లోని ట్రినిటీ హైస్కూల్ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో సంగీత సాహిత్య కళాభిమానులు హాజరై విజయవంతం చేశారు.

"సంగీత సాహిత్య నృత్య సమ్మేళనం" అనే పేరుతో... ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు వేడుకల్లో భాగంగా జరిగాయి. తెలుగు ప్రముఖులు పాలుపంచుకున్న ఈ సంబరాల్లో "తెలుగు వెలుగు" పత్రిక ద్వివార్షికోత్సవ ప్రత్యేక సంచికను జస్టిస్ గోపాలకృష్ణ విడుదల చేశారు.

మా తెలుగుతల్లి ప్రార్థనాగీతంతో ప్రారంభమైన ఈ వేడుకల్లో ప్రముఖ సినిమా నటుడు గొల్లపూడి మారుతీరావు "తెలుగు సినిమా నాడు-నేడు" అనే అంశంపై మాట్లాడారు. అనంతరం మహాకవి శ్రీశ్రీ సతీమణి సరోజ మాట్లాడుతూ... తన భర్త ఆదర్శాలను, ఆయన కవితల్లోని గొప్పదనాన్ని ప్రేక్షకులకు వివరించారు.

స్థానిక కళాకారులతో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సినీ కవులు చంద్రబోస్, సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రసంగాలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ఇటీవల మరణించిన పాప్ సంగీత రారాజు మైఖేల్ జాక్సన్‌కు నివాళులర్పిస్తూ... జాక్సన్ పాడిన థిల్లర్ బీట్ ఇట్ బీట్ ఇట్ పాటకు తెలుగు పుంతలు కలిపి ప్రజాకవి గోరటి వెంకన్న పాడిన పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

ఇంకా ఈ కార్యక్రమంలో టాన్‌టెక్స్ అధ్యక్షులు డాక్టర్ కొర్సపాటి శ్రీధర్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ కన్నెగంటి చంద్రశేఖర్, నెలనెలా సాహిత్య వేదిక సమన్వయకర్త మల్లవరపు అనంత్, తానా అధ్యక్షుడు ఎలెక్ట్ తోటకూర ప్రసాద్, రావు కలవల, భాస్కర్ తదితరులు పాల్గొని వేడుకలను దిగ్విజయంగా నిర్వహించారు.

వెబ్దునియా పై చదవండి