"తెలుగు వెన్నెల"లో 'అత్తగారి కథల'పై విశ్లేషణ

FILE
హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (టీసీఏ) స్వచ్ఛంద విభాగమైన హ్యూస్టన్ సాహితీ బృందం సారధ్యంలో నిర్వహించబడుతున్న "నెల నెలా తెలుగు వెన్నెల" పదకొండవ సాహిత్య సమావేశం శుగర్లాండ్ లైబ్రరీలో ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దివంగత నటి భానుమతీ రామకృష్ణ రాసిన "అత్తగారి కథల"పై వక్తలు వ్యాఖ్యానించారు.

సుదేష్ పిల్లుట్ల వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ పూదూర్ జగదీశ్వరన్ హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ప్రారంభించిన పూదూరు పద్మ భానుమతిగారు రాసిన "అత్తగారి కథలు"పై ప్రసంగించారు. భానుమతి రాసిన మూడు కథలను ప్రత్యేకంగా విశ్లేషించిన ఆమె.. ఆనాటి భానుమతి ఒక రచయిత్రిగా, గాయకురాలిగా, నటిగా, నాట్యగత్తెగా, దర్శకురాలిగా.. విభిన్న పార్శ్వాలను కలిగి ఉన్న ఏకైక వనితగా ప్రశంసించారు.

ఇదే కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయం బయాలజీ అధ్యాపకుడయిన పూదూర్ జగదీశ్వరన్‌ను వంగూరి చిట్టెన్ రాజు సభకు పరిచయం చేశారు. అష్టావధానిగా, రచయితగా, కవిగా రాణిస్తున్న జగదీశ్వరన్ సాహిత్య సమాజానికి చేస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. "అష్టావధానం-అవధాన ప్రక్రియ" అనే అంశాన్ని ఈ సందర్భంగా జగదీశ్వరన్ విపులంగా వివరించి చెప్పారు. భారతదేశంలోనే కాక, అమెరికాలో ఇరవై అవధానాలు చేసిన అనుభవాలను సైతం ఆయన సభికులతో పంచుకున్నారు.

సభ ప్రారంభంలో గత ఇరవై ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని పాటిస్తూ తెలుగు సాంస్కృతిక సమితి, ఆటా, తానా సంస్థల తరపున ధర్మకర్త ముత్యాల భాస్కరరావు ముగ్గురు హైస్కూలు విద్యార్థులకు ఐదు వందల డాలర్లను స్కాలర్‌షిప్‌లుగా అందించారు. ఆటా, టీసీఏ నాయకులు, సభ్యులతోపాటు సుమారు 60 మంది సాహిత్యాభిమానులు హాజరైన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగి విజయవంతమయ్యింది.

వెబ్దునియా పై చదవండి