దక్షిణాఫ్రికాలో ఆంధ్రా యువకుడిపై దాడి

ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై, ఉద్యోగులపై జరుగుతున్న దాడులు ఇంకా తగ్గుముఖం పట్టకుండానే... ఉద్యోగం కోసం పరాయి దేశానికి వెళ్లిన మరో భారతీయుడిపై దాడి జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని వరంగల్ జిల్లా ఆరెపల్లి గ్రామానికి చెందిన కిరణ్‌పై దక్షిణాఫ్రికాలో దాడి జరిగినట్లు అతని స్నేహితులు సమాచారం అందించారు.

బుద్దె శంకరయ్య, ఇందిరమ్మల కుమారుడైన కిరణ్ గత రెండు సంవత్సరాలుగా దక్షిణాఫ్రికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. రెండు నెలల క్రితమే సొంత ఊరికి వచ్చిన ఆయన పది రోజుల క్రితమే మళ్లీ ఆ దేశానికి వెళ్లినట్లు అతని సోదరుడు గణేష్ పేర్కొన్నారు.

అయితే గత శనివారం రోజున కిరణ్‌పై దాడి జరిగినట్లు అతని స్నేహితులు ఇక్కడి కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారం అందించారు. విధులకు హాజరై తిరిగివస్తున్న కిరణ్‌పై దుండగులు కాల్పులు జరిపినట్లు వారు వెల్లడించారు. రెండు బుల్లెట్లు కడుపులోకి దూసుకెళ్లటంతో ఆసుపత్రికి తరలించామని, పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

అయితే కుమారుడిపై దాడి జరిగిందన్న వార్త తెలుసుకున్న కిరణ్ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా ఫోన్‌లో ప్రయత్నిస్తున్నా ఎలాంటి స్పందన రావడం లేదు. సోమవారం రాత్రి కిరణ్ స్నేహితులు మరోసారి ఫోన్ చేసి దాడి గురించి వివరించారు. ఇటీవల కిరణ్ తాను గతంలో పనిచేసిన కంపెనీలో ఉద్యోగం మానివేసి వేరే కంపెనీల ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లి సెలెక్ట్ అయ్యాడని వారు తెలిపారు.

అయితే ఇప్పటికే ఉన్న ఉద్యోగాన్ని వదలి, తమకు పోటీగా ఈ ఇంటర్వ్యూకి ఎందుకొచ్చావంటూ... ఒక భారతీయ యువకుడు, మరో ముగ్గురు దక్షిణాఫ్రికా యువకులు కిరణ్‌పై దాడి చేసి, కాల్పులు జరిపినట్లు అతని స్నేహితులు కిరణ్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి