నవంబరులో దుబాయి 'రసమయి' రజతోత్సవ వేడుకలు

మంగళవారం, 7 జూన్ 2011 (19:59 IST)
PR
గత 25 ఏళ్లుగా అరబ్ ఎమిరేట్స్‌లో వేలాది తెలుగు కుటుంబాల అభిమానం చూరగొన్న దుబాయి 'రసమయి' తెలుగు సాంస్కృతిక సమాఖ్య తమ సంస్థ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో వచ్చే నవంబర్ మాసంలో రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గత శుక్రవారం దుబాయిలో కార్యవర్గ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో సంస్థ అధ్యక్షులు శ్రీ చుండూరు ధర్మకర్త మాట్లాడుతూ సంస్థ రజతోత్సవ వేడుకలను అత్యంత ప్రాముఖ్యత కలిగిన 11 -11 -(20)11 వ తేదిన దుబాయిలో అత్యంత వైభవంగా నిర్వహించాలని సూచించారు. ధర్మకర్త నిర్ణయానికి సభ్యులు తమ హర్షద్వానాల ద్వారా ఆమోదాన్ని తెలిపారు.

అనంతరం సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీ కోలపూడి మనోహర్ మాట్లాడుతూ అత్యంత ఘనంగా నిర్వహించ తలపెట్టిన 'రసమయి' రజతోత్సవ వేడుకలలో ప్రపంచ వ్యాప్తంగా విద్యా, వాణిజ్య, రాజకీయ, సామాజిక, రాజకీయ, సినీ, వైద్య, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ వంటి ప్రచార రంగాలలో పేరుగాంచిన తెలుగు ప్రముఖులను ఆహ్వానించి సత్కరించుకోవాలని, ఇంకా ఆనాటి వేడుకలలో ప్రముఖ సినీ కళాకారులతో పాటు వివిధ రంగాలలో ప్రావీణ్యత పొందిన కళాకారులచే విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు తీర్మానించగా సభ్యులు ఆమోదించారు.

ఇదే సమావేశంలో 'రసమయి' కార్యవర్గ సభ్యులు శ్రీ అర్జా ప్రసాద్ కు పి.ఆర్.వోగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ సభ్యుల ఆమోదంతో అధ్యక్ష కార్యదర్శులు నిర్ణయించడమైనది.

గత రెండున్నర దశాబ్దాలుగా గల్ఫ్‌లోని తెలుగు ప్రజల మనోభావాలకు అద్దంపడుతూ దుబాయి 'రసమయి' చేపట్టిన అనేక సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల వివరాలను ఛాయాచిత్రాలతో పొందుపరిచి 'రసమయి' ప్రత్యేక సంచికను విడుదల చేసేందుకు సమావేశం తీర్మానించడమైనది.

ఇందులో పలువురు ప్రఖ్యాత రచయిత(త్రు)లు రచించిన సందేశాత్మకమైన, సామాజిక పరమైన మరియు హాస్యభరితమైన రచనలతో పాటు గల్ఫ్‌లోని అభ్యుదయ, వర్ధమాన రచయిత(త్రు)లు రచించిన పలు కథలు, కథానికలు, కవితలు, మరియు జోక్స్‌తో అందమైన, ఆకర్షణీయమైన రంగులలో ప్రత్యేక సంచికను ముద్రించేందుకు నిర్ణయించినట్లు సమావేశం తీర్మానించింది.

చివరగా నవంబర్‌లో నిర్వహించ తలపెట్టిన రసమయి రజతోత్సవ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని తెలుగు సంఘాలను ఆహ్వానించాలని నిర్ణయిస్తూ అదేవిధంగా ప్రపంచంలోనే అత్యధిక తెలుగు కుటుంబాలు నివసిస్తున్న గల్ఫ్ దేశంలో అత్యంత భారీ వ్యయంతో, వ్యయ ప్రయాసలతో నిర్వహించనున్న మా ఈ 'రసమయి' రజతోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు బాధ్యతగా తమకు అన్నివిధాల ఇతోధిక సాయం అందించాల్సిందిగా అభ్యర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన చేయాలని సమావేశం తీర్మానించింది.

వెబ్దునియా పై చదవండి