నేపాల్ కారు ప్రమాదం : భారతీయుల దుర్మరణం

నేపాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు భారతీయులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బీహార్‌కు చెందిన ఏడుగురు వ్యక్తులు ఒక 15 సంవత్సరాల బాలుడికి వైద్య పరీక్షలు చేయించేందుకు ఖాట్మండు నగరానికి వచ్చారు.

మంగళవారం అర్ధరాత్రి 12.45 గంటల మధ్యన ఆసుపత్రి నుంచి ఏడుగురు భారతీయులు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు.. స్థానిక పోలీసు అధికారి వెల్లడించారు. పేవ్‌మెంట్‌మీద నడుస్తున్న వీరిని అతివేగంగా వస్తోన్న కారు ఒకటి అదుపుతప్పి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారన్నారు.

చికిత్సకోసం వచ్చిన పదిహేనేళ్ల బాలుడితో సహా ఈ భారతీయులలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారని పోలీసు అధికారి తెలిపారు. ఇక మిగిలిన బీహార్‌లోని ప్రాంతానికి చెందిన దీపక్ గుప్తా అనే వ్యక్తి మాత్రం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ.. స్థానిక బిర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆయన చెప్పారు.

మరణించిన వారిలో బీహార్‌లోని సీతామర్హి ప్రాంతానికి చెందిన ధర్మనాథ్ సిన్హా (50), క్రిష్ణ దేవి (40), మదన్ గుప్తా (29), సంజీవ్ గుప్తా (15)లు మరియు మోతిహరి ప్రాంతానికి చెందిన బినా సింగ్ (46), మరో 18 సంవత్సరాల వ్యక్తి ఉన్నట్లు పోలీసు అధికారి వివరాలు అందించారు. అయితే ఈప్రమాదానికి కారకులైన కారు డ్రైవర్, కారులోని వ్యక్తులు పారిపోయినట్లు ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి