ప్రవాసాంధ్రులకు జేఎన్‌టీయూ సహకారం

అమెరికాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం (జేఎన్‌టీయూ)లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించేందుకుగానూ, ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి వంద సీట్లను కేటాయిస్తున్నట్లు... ఆ విశ్వవిద్యాలయం ఉపకులపతి అల్లం అప్పారావు వెల్లడించారు.

అమెరికాలో ప్రస్తుతం ఉన్నత విద్య చాలా ఖరీదైన వ్యవహారంలాగా మారింది. అక్కడి ప్రవాసాంధ్రులు తమ పిల్లలను ఇంజనీరింగ్ చదివించాలంటే, సంవత్సరానికి రూ 2.50 కోట్లు (50 వేల డాలర్లు)ను ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కార్యదర్శి నన్నపునేని మోహన్, దక్షిణ కరోలినా ఉన్నత విద్యాశాఖ కమీషనర్ డాక్టర్ కొర్లపాటి రఘులు కాకినాడలోని జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయాన్ని సంప్రదించారు.

దీంతో... ప్రవాసాంధ్రుల కష్టాలను సానుభూతితో అర్థం చేసుకున్న జేఎన్‌టీయూ ఉపకులపతి అల్లం అప్పారావు, ప్రవాస విద్యార్థుల కోసం వంద సీట్లను కేటాయించేందుకు ముందుకు వచ్చారు. ఈ రకంగా ఏడాదికి కేవలం 2,500 డాలర్లతో ప్రవాసాంధ్ర విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే సౌకర్యాన్ని ఏర్పరిచారు.

ప్రవాసాంధ్రులకు తక్కువ ఖర్చుతో ఇంజనీరింగ్ విద్యను అందుబాటులోకి తెచ్చేందుకుగానూ ఈ ప్రణాళికను రూపొందించినట్లు ఈ మేరకు నన్నపునేని మోహన్ మీడియాకు తెలియజేశారు. ఆన్‌లైన్ పద్దతిలో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సులను కూడా అందించేందుకు జేఎన్‌టీయూ అంగీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే బీటెక్ విద్యార్థులు మాత్రం నాలుగేళ్ల కాలంపాటు ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండి చదువుకోవాల్సి ఉంటుందన్నారు.

వెబ్దునియా పై చదవండి