"ప్రైవీ కౌన్సిల్"కు స్వరాజ్ పాల్ ఎంపిక

ప్రవాస భారతీయుడు, ప్రముఖ వ్యాపారవేత్త అయిన లార్డ్ స్వరాజ్‌ పాల్ (78) బ్రిటన్ రాణి రాజకీయ సలహా బృందం (ప్రైవీ కౌన్సిల్)లో సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనను వెల్లడించింది. కాగా... ఈ కౌన్సిల్‌కు భారతీయుడొకరు ప్రాతినిధ్యం వహించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

బ్రిటీష్ రాజవంశానికి సలహాలిచ్చే ఈ సంస్థలో ప్రధానమంత్రులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సభ్యులుగా ఉంటారు. ఆస్ట్రేలియా, కెనడా ప్రధానమంత్రులు కూడా ఇందులో సభ్యులుగా నియమితులయ్యారు. జీవితకాలంపాటు వీరందరూ ఈ కౌన్సిల్‌లో సభ్యులుగా కొనసాగుతారు.

469 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ప్రైవీ కౌన్సిల్ 7వ శతాబ్దం వరకు సుప్రీం లెజిస్టేటివ్ వ్యవస్థగా పనిచేసింది. ఈ కౌన్సిల్ రాణి, ఇతర మంత్రులతో ప్రతినెలా సమావేశాలను నిర్వహిస్తుంటుంది. ఈ సంస్థ త్వరలో సమావేశం కానున్న నేపథ్యంలో స్వరాజ్ పాల్ ఎంపికవడంతో ఎన్నారై ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే... 78 ఏళ్ల స్వరాజ్‌పాల్ "బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్"కు ఎంపికయిన తొలి ఆసియా వాసిగా ఇప్పటికే చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. కపారో గ్రూప్ ఛైర్మన్ అయిన పాల్ ప్రైవీ కౌన్సిల్‌కు తనను ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ పదవి తనకూ, భారతదేశానికి దక్కిన గొప్ప వరమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి