మన్మోహన్‌జీ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి: ఎన్నారైలు

సోమవారం, 6 జూన్ 2011 (14:13 IST)
WD
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఎన్నారైలు కోరారు. పీపుల్ ఫర్ లోక్‌సత్తా మరియు భారత్ స్వాభిమాన్స్ ఆధ్వర్యంలో బాబా రాందేవ్ బాబా చేపట్టిన అవినీతిపై సత్యాగ్రహానికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.

బాబా రాందేవ్ చేస్తున్న దీక్షను భగ్నం చేయడాన్ని తప్పు పట్టారు. శాంతియుతంగా చేస్తున్న దీక్షను భగ్నం చేయడంపై ప్రధానమంత్రి స్పందించి తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. పీఎఫ్ఎల్ దీనిపై పత్రికా ప్రకటన విడుదల చేసింది. రాందేవ్ బాబాను కించపరుస్తూ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొంది. రాజకీయాలలో ప్రవేశించరాదంటూ గణతంత్ర భారతదేశంలో నియంత్రించే అధికారం ఎవరికీ లేదని తెలిపింది.

భారత్ స్వాభిమాన్‌తో కలిసి పీఎఫ్ఎల్ అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీ సంధానకర్తగా వ్యవహరించిన హైమ మాట్లాడుతూ... మానవహక్కుల ఉల్లంఘన జరిగితే భారతదేశానికి లిబియాకు మధ్య ఇక తేడా ఏముంటుంది అని ప్రశ్నించారు. అవినీతిపై పోరు చేస్తున్న ప్రముఖ వ్యక్తి రాందేవ్‌కే ఈ గతి పడితే ఇక సామాన్య మానవుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

దీనిపై ప్రధానమంత్రి జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. గతంలో పీఎఫ్ఎల్ అన్నాహజారేకు మద్దతుగా పలు ర్యాలీలను నిర్వహించింది. అంతాకాకుండా అవినీతికి వ్యతిరేకంగా దండిమార్చ్ 2 వంటి పలు కార్యక్రమాలను పీఎల్ఎఫ్ చేస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి