మలేషియాలో ఎన్నారైల కోసం మరో పార్టీ

మలేషియాల ప్రవాస భారతీయుల కోసం మరో నూతన రాజకీయ పార్టీ ఒకటి ఆవిర్భవించింది. నిషేధిత హిండ్రాఫ్ (హిందూ రైట్స్ యాక్షన్ ఫోర్స్) అధినేత పీ. ఉదయ్ కుమార్.. "హ్యూమన్ రైట్స్ పార్టీ (హెచ్‌ఆర్పీ)" పేరుతో ఈ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు.

ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ... అధికార సంకీర్ణ ప్రభుత్వం, మూడు పార్టీల ప్రతిపక్ష కూటమి ప్రవాస భారతీయుల ప్రయోజనాలు కాపాడటంలో విఫలం అయినందువల్లనే కొత్త పార్టీని స్థాపించాల్సి వచ్చిందని ప్రకటించారు. అయితే తాను మాత్రం హిండ్రాఫ్‌లోనే కొనసాగుతానని, హెచ్‌ఆర్పీకి తన సోదరుడు వేదమూర్తి నాయకత్వం వహిస్తాడని ఆయన వెల్లడించారు.

తమ పార్టీ న్యాయబద్ధంగా పనిచేస్తూనే రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తుందని ఉదయ్ కుమార్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో 15 పార్లమెంట్, 38 శాసనసభా స్థానాలకు తమ పార్టీ పోటీ చేయనుందని ఆయన వివరించారు. కాగా... 2007 డిసెంబర్‌లో మలేషియా అంతర్గత భద్రతా చట్టం కింద అరెస్టయిన ఈయన, 2009 మే నెలలో విడుదలైన సంగతి తెలిసిందే...!

వెబ్దునియా పై చదవండి