మెల్లగా కోలుకుంటున్న మురళీకృష్ణ

అమెరికాలో నల్లజాతీయుడి చేతిలో గాయపడిన తెలుగు యువకుడు కడియాల మురళీకృష్ణ నెమ్మదిగా కోలుకుంటున్నాడని.. మిసిసిపీలో ఉంటున్న ఎన్నారై జోత్స్న చౌదరి వెల్లడించారు. ప్రస్తుతానికి మురళీకి ప్రాణాపాయం తప్పినట్లేనని వైద్యులు తెలిపారని ఆమె చెప్పారు.

ఈ విషయమై జోత్స్న మాట్లాడుతూ... గల్ఫ్‌ఫోర్ట్‌లోని షెల్ పెట్రోల్ బంక్ సమీపంలో మురళీకృష్ణపై దాడి జరిగిందని, ఈ దురాగతానికి పాల్పడిన ఆంథోనీ క్రాఫర్డ్ అనే ఆఫ్రికన్ అమెరికన్ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారని ఆమె వివరించారు.

ఆంథోనీ స్టోర్ నుంచి కొన్ని వస్తువులు దొంగతనం చేసి పారిపోతుండగా, మురళీ అడ్డగించటంతో... ఆంథోనీ తన కారుతో మురళీని సుమారు కిలోమీటర్ దాకా ఈడ్చుకెళ్లాడని జోత్స్న తెలిపారు. దీన్నంతా కళ్లారా చూసిన ఓ కస్టమర్ పోలీసులకు ఫోన్ చేయడంతో, వెంటనే స్పందించిన పోలీసులు గాయపడిన మురళీని ఆసుపత్రికి తరలించి, తమకు సమాచారం అందించినట్లు ఆమె చెప్పారు.

కాగా... ఈ దాడిలో మురళీకి ఏడుచోట్ల గాయాలు కాగా, ముందుగా గల్ఫ్‌ఫోర్ట్ మెమోరియల్ ఆసుపత్రి‌లో చేర్పించి, ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం అతడిని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ అలబామా మెడికల్ సెంటర్‌కు తరలించినట్లు జోత్స్న పేర్కొన్నారు. అప్పట్నించీ ఐసీయూలో చికిత్స పొందుతున్న మురళీ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే... మురళీపై దాడికి పాల్పడిన ఆంథోనీని క్రాఫర్ట్ పోలీసులు దాడి జరిగిన రోజునే అరెస్టు చేశారు. నేర చరిత్ర కలిగిన అతడిపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. కాగా... ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, తెనాలి మండలంలోని గుడివాడకు చెందిన మురళీకృష్ణ, మిసిసిపి యూనివర్సిటీలో విద్య అభ్యసిస్తున్నాడు.

వెబ్దునియా పై చదవండి