రాజకీయాలకు అతీతంగా "తానా" : జయరాం

రాజకీయాలకు అతీతంగా, అసలు వాటి ప్రస్తావనే లేకుండా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు.. ఆ సంస్థ నూత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కోమటి జయరాం వెల్లడించారు. అమెరికాలోని ప్రవాసాంధ్రులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

తానా నూతన అధ్యక్షుడిగా రాబోయే రెండేళ్ల కాలంలో చేపట్టబోయే కార్యక్రమాల గురించి జయరాం మాట్లాడుతూ... ఆంధ్ర రాష్ట్రంలో తానా సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఏడాది ప్రతిభావంతులైన 20 మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను ఇస్తున్నామనీ, ఇకపై వీటి సంఖ్యను రెట్టింపు చేస్తామని ఆయన వివరించారు. అలాగే తానా తరపున కొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటామన్నారు.

ఇదిలా ఉంటే... తానా కార్యకలాపాల నిర్వహణకు ఒక ఏడాదిలోపు అమెరికాలో శాశ్వత భవనాన్ని, కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు జయరాం తెలిపారు. అయితే వీటిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయాన్ని సంస్థ కార్యవర్గ సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పారు.

అలాగే అమెరికాలో ఆర్థికమాంద్యం కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ఆంధ్రా యువకుల సౌకర్యార్థం ఓ హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు జయరాం అన్నారు. ఆపదలో ఉన్న ఆంధ్ర విద్యార్థులను, ప్రవాసాంధ్రులను ఆదుకునేందుకు "టీం స్క్వేర్" అనే పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

హైదరాబాదు నగరంలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటుచేసి తానా ఉత్సవాలను నిర్వహించాలని కూడా యోచిస్తున్నట్లు కోమటి జయరాం వెల్లడించారు. ఇంకా... పేద కళాకారులను, అంతరించిపోతున్న ప్రాచీన జానపద కళలను వెలుగులోకి తెచ్చి ప్రోత్సహించేందుకు కూడా కృషి చేస్తామని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి