వరద బాధితుల కోసం తెలుగు సంఘాల "బెనిఫిట్ షో"

FILE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల్లో సర్వస్వం కోల్పోయిన బాధితులకు సహాయం చేసేందుకుగానూ.. తానా, ఆటా, టాన్‌టెక్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో "బెనిఫిట్ షో"ను నిర్వహించనున్నాయి. ఈ విషయాన్ని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (టాన్‌టెక్స్) అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు.

నవంబర్ 7వ తేదీ ఆదివారం రోజున టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో గల సెంటన్షియల్ హైస్కూల్‌లో సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటలవరకూ ఈ బెనిఫిట్ షో జరుగనుందని టాన్‌టెక్స్ పేర్కొంది. ఇందులో సినీ హాస్య నటులు అనంత్, గుండు హనుమంతరావు.. నటీమణులు అపూర్వ, మనోజ తదితర సినీ కళాకారులు పాల్గోనున్నారని ఆ సంస్థ వివరించింది.

ఈ బెనిఫిట్ షోలో భాగంగా నటుల హాస్యరస కార్యక్రమాలు, ప్రముఖ తెలుగు సినీకళాకారుల డ్యాన్సులను నిర్వహించనున్నట్లు టాన్‌టెక్స్ తెలిపింది. ఈ షో ద్వారా సమకూర నిధులను ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల సహాయం కోసం వినియోగిస్తామని ఆ సంస్థ తెలియజేసింది.

ఇదిలా ఉంటే.. ఈ బెనిఫిట్ షోకు హాజరయ్యేవారు విందు భోజనానికి కలిపి 10, 20 డాలర్ల టిక్కెట్లను లేదా 50 డాలర్లు విలువగల వీఐపీ టిక్కెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే స్పాన్సర్ టిక్కెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. కాగా.. టిక్కెట్లు నేరుగా కొనుగోలు చేయలేనివారి కోసం ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంచినట్లు టాన్‌టెక్స్ సంస్థ వివరాలందించింది.

వెబ్దునియా పై చదవండి