విమాన ప్రమాదంలో భారత సంతతి వ్యక్తుల మృతి

అమెరికాలోని అల్బనీలో సోమవారం జరిగిన ఓ విమాన ప్రమాదంలో ముగ్గురు భారత సంతతికి చెందిన ఇండియన్ అమెరికన్లు దుర్మరణం పాలయ్యారు. అల్బనీకి చెందిన ప్రముఖ హోటల్ వ్యాపారి జార్జి కొలాత్ తన పదకొండేళ్ల కొడుకు, డాక్టరైన స్నేహితుడితో కలిసి ప్రయాణిస్తున్న చిన్న విమానం మొహాక్ నదిలో కూలిపోయింది.

ఈ ప్రమాదంలో మృతి చెందిన కొలాత్ కుమారుడు, డాక్టర్ల మృతదేహాలను అధికారులు కనుగొన్నారు. కొలాత్ మృతదేహం ఇంకా దొరకలేదనీ, సాధ్యమైనంత త్వరగా వెదికి పట్టుకునేందుకు నది మొత్తం గాలిస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

ఇదిలా ఉంటే... మొహాక్ వ్యాలీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న ఈ విమానం విద్యుత్ సరఫరాలో లోపం కారణంగా నదిలో కూలిపోయి ఉండవచ్చునని విమానాశ్రయ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొలాత్ తన కొడుకును, మిత్రుడిని సంతోషపరిచేందుకు 1969లో తయారైన ఈ విమానంలో ప్రయాణించి, ప్రమాదానికి గురయ్యారు.

కాగా... కేరళకు చెందిన కొలాత్ అల్బనీలో 4 కోట్ల డాలర్ల విలువ గల ప్రాచీన కోటకు యజమాని కావడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి