వైట్‌హౌస్ సహ డైరెక్టరుగా ఎన్నారై యాక్టర్

అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా సలహామండలిలో పనిచేసేందుకు భారత సంతతికి చెందిన అంజు భార్గవకు అవకాశం లభించి రెండు రోజులు గడవకుండానే... మరో ఎన్నారైకు శ్వేతసౌధం నుంచి పిలుపువచ్చింది. వైట్‌హౌస్ సహ డైరెక్టర్ పదవి... భారత సంతతికి చెందిన అమెరికా నటుడు కల్పేన్ సురేశ్ మోడీని వెతుక్కుంటూ మరీ వచ్చింది.

ఈ మేరకు శ్వేతసౌధంలోని ప్రజా సంబంధాల విభాగంలో సహ డైరెక్టర్‌గా సురేశ్ మోడీని నియమిస్తూ ఓ అధికారిక ప్రకటన వెలువడింది. కాగా... ఆసియా-అమెరికా, ఫసిఫిక్ ద్వీప సమాజ కళ, సాంస్కృతిక విభాగం నిర్వహణలో అధ్యక్షుడికి మోడీ తన సహాయ సహకారాలను అందిస్తారు.

ఇదిలా ఉంటే... భారత సంతతికి చెందిన యువతలో సురేష్‌కు మంచి పేరు ఉంది. ఈ యువతను ఒబామా ఆకర్షించటం వెనుక ఈయన హస్తం ఎంతో ఉందని చెప్పవచ్చు. అలాగే, అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ ఒబామా విజయానికి విశేషంగా కృషి చేశారు.

ఒబామా ప్రభుత్వంలో సహ డైరెక్టర్ పదవి లభించడంపై సురేశ్ సంతోషం వ్యక్తం చేస్తూ... ఈ ఉద్యోగంలో ఆకర్షణీయమైన జీతం లేకపోయినప్పటికీ.. అవకాశం లభించటం మాత్రం గొప్ప అవకాశంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. కాగా... తాజా బాధ్యతలను నిర్వర్తించేందుకుగానూ ఈయన ప్రముఖ టెలివిజన్ షో అయిన "హౌస్" నుంచి వైదొలగనున్నారు.

వెబ్దునియా పై చదవండి