అకస్మాత్తుగా గుండెపోటు వస్తే... తోటివారి ప్రాణాలు కాపాడటంపై శిక్షణ

సోమవారం, 20 మే 2019 (22:35 IST)
భాషే రమ్యం.. సేవే గమ్యం అని నినదించే నాట్స్ ఇప్పుడు ఈ అంశంపై కూడా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకుంది. సెయింట్ లూయిస్ నాట్స్ చాప్టర్ ఇప్పుడు సీపీఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను స్థానిక తెలుగు సంఘం టీ.ఏ.ఎస్‌తో కలిసి చేపట్టింది. దాదాపు 80 మంది తెలుగువారు ఈ సీపీఆర్ శిక్షణకు హాజరయ్యారు. గుండెనొప్పితో కింద పడిపోయినప్పుడు వారికి తిరిగి శ్వాస అందించే ప్రక్రియ సీపీఆర్ (కార్డియాక్ పల్మనరీ రిససిటేషన్- శ్వాస పునరుద్ధరణ ప్రక్రియ)పై నిపుణులు ప్రత్యేక శిక్షణనిచ్చారు. 
 
ఏదైనా ప్రమాదంలో గాయాలైన బాధితులు షాక్‌కు గురై ట్రామాలోకి వెళ్ళి నప్పుడు, భయాందోళనలో అపస్మారక స్థితిలోకి వెళ్ళినప్పుడు వారిని తిరిగి యథాస్థితికి తీసుకువచ్చేందుకు ఏ విధంగా వ్యవహరించాలనే విషయాలపై ఇందులో శిక్షణ ఇచ్చారు. శిక్షణ తీసుకున్న వారికి సర్టిఫికెట్‌లను అందించారు. ఇక్కడకు వచ్చిన వారికి నాట్స్ ఉచితంగా సీపీఆర్ కిట్స్ అందించింది. 
 
అత్యవసరంగా గుండె నొప్పి వస్తే అలాంటి వ్యక్తులను వైద్యశాలకు ఎలా తరలించాలి. ఆ లోపల శ్వాస ఎలా అందించాలి అనే అంశాలను డెమో ద్వారా ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పించారు. డాక్టర్ సుధీర్ అట్లూరి, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, రమేశ్ బెల్లం, నాగ శిష్ట్లా  తదితరుల నాయకత్వంలో ఏర్పాటైన ఈ శిక్షణ శిబిరానికి మంచి స్పందన లభించింది. 
 
ప్రాణాలను కాపాడే ఇలాంటి శిక్షణ ఎంతో ఉపయోగకరమైందని శిక్షణ తీసుకున్న వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించిన టీఏఎస్ ప్రెసిడెంట్ సురేంద్ర బాచిన, టీఏఎస్ డైరక్టర్లు శ్రీనివాస్ భూమ, జగన్ వేజండ్లకు నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. దీంతో పాటు ఈ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన నాట్స్ సభ్యులందరిని అభినందించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు