ఎంఐసీ ఉపాధ్యక్ష రేసులో ఐరిష్ ఉక్కు మహిళ

FILE
మలేషియన్ ఇండియన్ కాంగ్రెస్ (ఎంఐసీ) ఉపాధ్యక్ష రేసులో ఐరిష్ ఉక్కుమహిళ పీ మరెయి (59) నిలిచారు. పార్టీలో ఉన్నతస్థాయిలో మహిళల ప్రాతినిధ్యం కొరవడటంతో తాను ఈ అధ్యక్ష పదవికి పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు ఈ మేరకు ఆమె వెల్లడించారు.

భారతీయ మహిళలు ఇక్కడ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, వారి సమస్యల పరిష్కారం కోసం చాలా కృషి చేయాల్సి ఉందని, అందుకోసమే తాను ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నానని మరెయి వ్యాఖ్యానించారు. పురుషాధిపత్యం ఉన్న ఎంఐసీ పార్టీలో 19 ఏళ్ల వయసులోనే సభ్యురాలిగా చేరిన మరెయి పార్టీ వ్యవహారాలు చక్కదిద్దడంలో ఇప్పటిదాకా ఎలాంటి సమస్యలు ఎదుర్కోకపోవడం గమనార్హం.

మలేషియాలోని నెగ్రీ సెంబ్లీన్ రాష్ట్రంలో డివిజనల్ స్థాయిలో పనిచేస్తున్న ఒకే ఒక్క మహిళ అయిన మరెయి.. మంచి వ్యాపారవేత్త కూడా..! సెరెంబన్‌లోని జిలేబు డివిజన్‌కు మరెయి 15 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. తనకు పెద్దగా విద్యార్హతలు లేకపోయినా 40 సంవత్సరాలుగా ఇక్కడి భారతీయ సమాజానికి, పార్టీకి చేసిన సేవలు తనకు ప్లస్ పాయింట్లు అవుతాయని మరెయి ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే... సెప్టెంబర్ 12వ తేదీన మిక్ ఉపాధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఎమ్ఐసీ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎస్. సామివేలుకు, మరెయిపై సానుకూల దృక్పథం ఉండటంతో ఆమెకు ఈ పదవి లభించటంలో పెద్దగా కష్టమేమీ కాదని స్థానిక పత్రిక న్యూ స్ట్రెయిట్ టైమ్స్ ఓ కథనాన్ని వెల్లడించింది. కాగా.. అక్రమ సారాపై ఉద్యమాన్ని నిర్వహించి, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించటం ద్వారా మరెయి ఓ శక్తివంతమైన నేతగా వెలుగులోకి వచ్చారు.

వెబ్దునియా పై చదవండి