ఫ్రిజ్‌లో తల్లి శవాన్ని దాచిన ఎన్నారై మహిళ

భారత సంతతికి చెందిన ఓ వృద్ధురాలు.. గత ఇరవై సంవత్సరాలుగా తన తల్లి శవాన్ని ఫ్రిజ్‌లో దాచి ఉంచిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆగ్నేయ లండన్‌లో నివసించే దౌలత్ ఇరానీ (83), ఆమె సోదరిలు కలిసి 20 సంవత్సరాల క్రితం మరణించిన తల్లికి అంత్యక్రియలు జరుపకుండా... ఓ కవర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో దాచి ఉంచారు.

భారతదేశానికి చెందిన ఇరానీ తల్లి, గుల్బయ్ ఫ్రీడూన్ ముర్జన్ (1901).. ఇంగ్లండులో అక్రమంగా నివసిస్తుందనే విషయం ఆ దేశ అధికారులకు తెలుస్తుందన్న భయంతోనే వారు ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇరానీ ఇటీవలనే ఈ రహస్యాని ఓ స్నేహితురాలికి వెల్లడించటంతో విషయంలో వెలుగులోకి వచ్చినట్లు వారు తెలిపారు.

మెట్రోపాలిటన్ పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ... గుల్బయ్ మృతికి సంబంధించి తాము ఇప్పుడేమీ మాట్లాడలేమనీ, ఈ వారాంతలోకల్లా పోస్టు మార్టం ఫలితాలు వస్తాయనీ, ఆ తరువాతనే ఏ విషయం స్పష్టమవుతుందని అన్నారు. అయితే, ప్రస్తుతానికి వృద్ధురాలైన ఇరానీని హెచ్చరించి వదిలివేసినట్లు చెప్పారు.

ఇరానీ పొరుగింట్లో నివసిస్తున్న రే డైసన్ (77) అనే మహిళ మాట్లాడుతూ... ఇరానీ చాలా మంచిదనీ, తనపనేదో తాను చేసుకునేదనీ, ఎవరినీ ఇబ్బంది పెట్టే రకం కాదని అన్నారు. అయితే, ఆమె చేసిన పని మాత్రం తమను కలవరపాటుకు గురిచేసిందనీ ఆందోళన వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి