బాపూజీ ఇల్లు కొనుగోలు రేసులో కీర్తి మీనన్

FILE
దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్‌లోని జాతిపిత మహాత్మాగాంధీ నివసించిన ఇల్లును కొనుక్కునేందుకు ఆయన మునిమనుమరాలు కీర్తి మీనన్ కూడా రేసులో నిలిచారు. మహాత్ముడి ఇంటిని కొనేందుకు పలువురు ముందుకొచ్చినా, ఆయన కీర్తి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

జోహెన్నెస్‌బర్గ్‌లోని ఒచర్డ్ సబర్బన్‌లో ఉన్న బాపూజీ ఇంటిని, ఆ ఇంటి యజమాని నాన్సీ బాల్ అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఇంటిని కొనుగోలు చేసేందుకు కీర్తితో పాటు, మలేషియాకు చెందిన వ్యాపారవేత్త ఒకరు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారనీ, వారితో చర్చలు జరుపుతున్నానని నాన్సీ బాల్ ప్రకటించారు.

భారత ప్రభుత్వం, పలువురు వ్యాపారవేత్తలు ఈ విషయంలో తనను సంప్రదించారనీ.. ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరలేదని నాన్సీ బాల్ వెల్లడించారు. మహాత్ముడి అనుచరులుగా ఆయన జ్ఞాపకాలను పదిలపర్చాలన్నదే తమ అభిమతమని నాన్సీ అన్నారు.

మహాత్ముడి ఇంటికి 3.5 లక్షల డాలర్ల ధర పలుకుతుందని భావిస్తున్నట్లు నాన్సీ బాల్ పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలవల్ల తాను కేప్‌టౌన్‌కు మారాలని నిర్ణయించుకోవడంతో ఈ ఇల్లు అమ్మకానికి పెట్టాల్సి వచ్చిందని ఆమె వివరించారు. కాగా... 1908-09 మధ్యకాలంలో బాపూజీ ఈ ఇంటిలో నివాసమున్నారని నాన్సీ తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి