భారత్‌లో సాంకేతిక విద్య భేష్.. బేష్..!!

FILE
భారత్‌లోని సాంకేతిక విద్య ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని అమెరికా విదేశాంగ శాఖా మంత్రి హిల్లరీ క్లింటన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సాంకేతిక విద్యలో భారత్ అందెవేసిన చెయ్యి అని.. లక్షలాది మంది పేద విద్యార్థులకు విద్య అందని ద్రాక్ష చందంగా ఉన్నప్పటికీ, ఆ దేశంలోని సాంకేతిక విద్య మాత్రం ఉత్తమ ఫలితాలను ఇస్తోందని ఆమె కొనియాడారు.

ఇటీవల హిల్లరీ భారత్‌లో పర్యటించిన సందర్భంగా సంధించిన పలు ప్రశ్నలకు తాజాగా ఆమె ఇచ్చిన సమాధానాలను ఆ దేశ విదేశాంగ శాఖ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఇతరులు ఈర్ష్యపడేలా భారతదేశం తన సాంకేతిక విద్యను రూపొందించిందని ఆమె ప్రశంసించారు.

ప్రస్తుతం భారత్‌లో లక్షలాదింది విద్యార్థులకు అసలు ప్రాథమిక విద్యే అందటం లేదనీ, గ్రామీణ ప్రాంతాలలో సేవలందించేందుకు పలువురు నిరాసక్తత కనబరుస్తున్నారని, సౌకర్యాలు కూడా అంతంతమాత్రమేనని హిల్లరీ వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తమ విద్యను అందించేందుకు వ్యక్తులు, ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు ముందుకు రావాలని ఆమె కోరారు.

ఈ రకంగా చిన్నారులకు దేవుడు ఇచ్చిన వనరులను వినియోగంలోకి తీసుకువచ్చి, వారికి విద్యాపరంగా అగ్రపథంలో దూసుకెళ్లేందుకు అవకాశం కల్పించాల్సి ఉందని హిల్లరీ ఓ ప్రశ్నకు విపులంగా సమాధానం ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి