రినీ కకాటీకి "గ్లోరీ ఆఫ్ ఇండియా" అవార్డు

ప్రవాస భారతీయ మహిళ రినీ కకాటీకి ప్రతిష్టాత్మక "గ్లోరీ ఆఫ్ ఇండియా" అవార్డు లభించింది. ఇండియా ఇంటర్నేషనల్ సొసైటీ అందజేసే ఈ అవార్డును లండన్‌లోని బకింగ్‌హామ్‌లోని సెయింట్ జేమ్స్ వద్ద ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో భారత కేంద్ర మాజీ మంత్రి ఎం.వీ. రాజశేఖరన్ రినీకి అందజేశారు.

గత 35 సంవత్సరాలుగా విద్య, సాంస్కృతిక, సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొని విశేషమైన సేవలను అందించినందుకుగానూ రినీ కకాటీకి ఈ అవార్డు లభించింది. కాగా... భారత్‌తో పాటు విదేశాల్లోని ప్రవాస భారతీయులు, భారతీయేతరులతో కలిసి పనిచేసే ఇండియా ఇంటర్నేషనల్ సొసైటీ, సొంత జిల్లాలకు గుర్తింపు తెచ్చే విధంగా కృషి చేసిన ప్రవాస భారతీయులకు ఈ అవార్డును ప్రదానం చేస్తోంది.

ఇండియా ఇంటర్నేషనల్ సొసైటీ సభ్యులు ఇండో-బ్రిటన్ సంబంధాలను బలోపేతం చేయటమేగాక, భారత ఆర్థిక అభివృద్ధికి కూడా పాటుపడుతుండటం గమనార్హం. అవార్డు తీసుకున్న సందర్భంగా రినీ మాట్లాడుతూ... ఇకపై మరింత బాధ్యతగా మహిళలకు, బాలలకు ఇంకా తన చేతనైన సాయాన్ని అందజేస్తానని హామీనిచ్చారు.

ఇదిలా ఉంటే... భారత్‌లోని అస్సాంకు చెందిన రినీ కకాటీ... హార్లెస్‌డెన్‌లో ఇంగ్లీష్ తరగతులను ప్రారంభించటం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం నిలువ నీడలేని మహిళలు, బాలల కోసం ఒక నర్సరీని కూడా ఏర్పాటు చేశారు. అంతేగాకుండా.. లండన్‌లోని న్యూఫీల్డ్ జూనియర్ స్కూలుకు ఆసియాకు చెందిన తొలి గవర్నర్‌గా కూడా విధులు నిర్వహించారు.

వెబ్దునియా పై చదవండి