సంజన జాన్‌పై కోర్టు ధిక్కారం కేసు నమోదు

FILE
ఇటీవల లైంగిక వేధింపుల కేసులో 59 సంవత్సరాల జైలుశిక్షకు గురయిన భారత సంతతికి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఆనంద్ జాన్ సోదరి సంజన జాన్ కోర్టు ధిక్కారం కేసు నమోదయ్యింది. న్యాయమూర్తి ఆల్విన్ డీమాలీతో సహా, కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజనపై విచారణ త్వరలోనే ప్రారంభం కానుంది.

తన సోదరుడి కేసు విచారణ గురించి న్యాయమూర్తి ఆల్విన్ డీమాలీతో మాట్లాడినట్లు సంజనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై త్వరలోనే విచారణ ప్రారంభమవుతుందని మరో న్యాయమూర్తి డేవిడ్ వెస్లీ వెల్లడించారు.

ఇదిలా ఉంటే... ఆనంద్ జాన్ కేసును విచారించిన 12 మంది న్యాయమూర్తుల బృందంలో ఆల్విన్ డీమాలీ ఒకరు. విచారణ సమయంలో ఆయన సంజనను కలవటమేగాక, తన ఫోన్ నెంబర్ కూడా ఆమెకి ఇచ్చారు. రెండుసార్లు ఆమెతో ఫోన్‌లో సంభాషించారు. దీంతో వీరిద్దరూ కోర్టు ధిక్కార విచారణను ఎదుర్కోనున్నారు.

కాగా.. పలువురు ఔత్సాహిక మోడల్‌లపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేరంపై ఆనంద్ జాన్‌కు లాస్ ఏంజెల్స్ సుపీరియర్ కోర్టు ఇటీవల 59 సంవత్సరాల జైలుశిక్షను విధించిన సంగతి పాఠకులకు తెలిసిందే. తీర్పు అనంతరం తన సోదరుడు భారత సంతతికి చెందినవాడు అవడంతోనే వివిక్షాపూరితమైన తీర్పునిచ్చారని జాన్ సోదరి తల్లితో కలిసి వాపోయిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి