తెలుగు వారికి రక్షణ కరువేనా..? : సుజన

శుక్రవారం, 16 జనవరి 2009 (14:54 IST)
"అమెరికాలో తెలుగు ప్రజలకు రక్షణ కరువేనా...?! అంటూ మంగళవారం హత్యకు గురయిన విశాల్ అక్షయ్ సోదరి సుజన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రైవేట్ వార్తా సంస్థతో సుజన మాట్లాడుతూ... అగ్రరాజ్యంలో వరుసగా తెలుగు విద్యార్థులు, ఉద్యోగస్తులపై జరుగుతున్న దాడులే ఇందుకు నిదర్శనమని ఆవేదన చెందారు.

ఇప్పటికైనా అక్కడి ప్రభుత్వం కళ్లుతెరచి, తెలుగు ప్రజలకు తగిన భద్రతను కల్పించాలని ఈ సందర్భంగా సుజన అమెరికా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తన సోదరుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా తమ దేశానికి తరలించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

కాల్పులు జరిగేందుకు అరగంట ముందే విశాల్ తమతో ఫోన్‌లో మాట్లాడాడనీ, అంతలోనే ఇంత దారుణం జరిగిపోయిందని సుజన కన్నీరుమున్నీరైనారు. డబ్బు కోసమే తమ సోదరుడిని దుండగులు పొట్టన బెట్టుకుని ఉంటారని ఆమె వాపోయింది.

ఇదిలా ఉంటే... అమెరికాలోని ఆర్కెన్సిస్ లిటిల్ రాక్ పట్టణంలో ఓ నల్లజాతి ముష్కరుడు జరిపిన కాల్పుల్లో సుజన సోదరుడు విశాల్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం.. విశాల్ హత్యకేసులో నిందితుడుగా భావిస్తున్న జాన్సన్స్ అనే నల్లజాతీయుడిని లిటిల్ రాక్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి