ప్రీతా బన్సాల్‌కు ఒబామా బృందంలో కీలక పదవి

బుధవారం, 21 జనవరి 2009 (13:56 IST)
అమెరికా నూతన అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యూహ బృందంలో భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయవాది ప్రీతా బన్సాల్‌కు కీలక పదవి దక్కింది. అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు కొద్ది గంటల ముందుగానే... ఒబామా ప్రీతాకు బడ్జెట్, కార్య నిర్వహణ కార్యాలయం (ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్-ఓఎంబీ)లో చోటు కల్పించారు.

ప్రస్తుతం న్యూయార్క్‌లోని ఓ న్యాయ సంస్థలో భాగస్వామిగా ఉన్న ప్రీతా ఇకపై ఓఎంబీలో సీనియర్ విధాన సలహాదారు, జనరల్ కౌన్సిల్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఒబామా పాలనా బృందంలో ఈమెను సొలిసిటర్ జనరల్‌గా నియమించనున్నట్లు మొదట ప్రచారం జరిగినప్పటికీ, అలా జరగక పోవడం గమనార్హం.

2004-05 సంవత్సరంలో అంతర్జాతీయ మత స్వేచ్ఛపై ఏర్పాటు చేసిన అమెరికా కమీషన్‌కు ప్రీతా అధినేతగా వ్యవహరించారు. ఇరాక్, ఆప్ఘనిస్థాన్, ఉబ్జెకిస్తాన్, సౌదీ అరేబియా, చైనా, రష్యా, వియత్నాం, టర్కీ, హాంకాంగ్‌లతో పాటు.. దక్షిణాసియాలోని పలు దేశాలలో ప్రీతా బన్సాల్ అమెరికా తరపున పలు దౌత్య కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.

వెబ్దునియా పై చదవండి