లీషెస్టర్ ఆసుపత్రికి మెర్లిన్ వాజ్ పేరు

బ్రిటన్‌లోని లీషెస్టర్‌లో 13 మిలియన్ పౌండ్ల వ్యయంతో నెలకొల్పిన "చార్న్‌వుడ్ హెల్త్ అండ్ సోషల్ కేర్ సెంటర్"కు భారత సంతతికి చెందిన ఎంపీ కీత్ వాజ్ తల్లి మెర్లిన్ వాజ్ పేరు పెట్టాలని నిర్ణయించారు.

ఈ హెల్త్ సెంటర్‌కు ఎవరి పేరు పెట్టాలనే విషయమై ఓటింగ్ జరపగా, మెర్లిక్‌కు అత్యధికులు మద్ధతు తెలిపారు. దీంతో మెర్లిన్‌ పేరు పెట్టాలని నిశ్చయించారు. గోవాకు చెందిన మెర్లిన్ లీషెస్టర్‌లో కౌన్సిలర్ పదవి చేపట్టిన తొలి ఆసియా వాసిగా ఖ్యాతి గడించారు. కాగా, 2003 అక్టోబర్‌లో ఆమె మరణించారు.

హెల్త్ సెంటర్‌కు తన తల్లి పేరు పెట్టాలని నిర్ణయించడంపై కీత్ వాజ్ సంతోషం వ్యక్తం చేశారు. లీషెస్టర్‌లో తన కుటుంబం చేసిన సేవలకు ఈ రకంగా గుర్తింపు రావడం తనకెంతగానో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. హౌస్ ఆఫ్ కామర్స్‌కు లీషెస్టర్ తూర్పు నియోజక వర్గం నుండి కీత్ వాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి విదితమే.

ఇదిలా ఉంటే... వేలాది మంది రోగులకు నాణ్యమైన సేవలు అందించే లక్ష్యంతో నిర్మించిన ఈ హెల్త్ సెంటర్ నగరంలో చిరస్థాయిగా నిల్చిపోనుందని లీషెస్టర్ నేషనల్ హెల్త్ సెంటర్ ఛైర్మన్ ఫిలిప్ పార్కిన్‌సన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి