ఇన్సూరెన్స్ సొమ్ముకోసం ఎన్నారై న్యాయవాది హత్య

FILE
బ్రిటన్‌లో ప్రవాస భారతీయ న్యాయవాది ఒకరు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన వ్యాపార భాగస్వామి చేతిలో హత్యకు గురైనట్లు అక్కడి న్యాయస్థానం మంగళవారం వెల్లడించింది. కాగా.. వినా పటేల్ అనే 51 సంవత్సరాల ఎన్నారై మహిళ, 1.5 మిలియన్ పౌండ్ల డబ్బుల కోసం తన సహోద్యోగి, వ్యాపార భాగస్వామి అయిన జాన్ కోర్ట్ చేతిలో హత్యకాబడినట్లు తెలుస్తోంది.

డైలీ మెయిల్ కథనం ప్రకారం.. జాన్ కోర్ట్ నియమించిన కిరాయి మనుషులు వినా పటేల్ మెడను నలిపి, ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. మూడు ఇళ్లను కొనుగోలు చేసిన జాన్, వందలాది పౌండ్ల అప్పుల్లో మునిగిపోవటంతోపాటు, సెలబ్రిటీ హంట్స్ పేరుతో లెక్కలేనన్ని నిధులను గుటకాయస్వాహా చేస్తున్నట్లు డైలీ మెయిల్ వ్యాఖ్యానించింది. పటేల్‌ను హత్యచేసి ఆమె జీవిత బీమా సొమ్ము 1.5 మిలియన్ పౌండ్లను పొందేందుకే జాన్ ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

కాగా... పటేల్‌ను హత్య చేసి, దాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకుగానూ కోర్ట్ బ్రియాన్ ఫారెల్ అనే 37 సంవత్సరాల కిరాయి హంతకుడితో బేరం కుదుర్చుకున్నట్లు ఈ మేరకు నత్తింగమ్ క్రౌన్ న్యాయస్థానం పేర్కొంది. అయితే కోర్ట్ మరియు ఫారెల్‌లు తాము ఈ హత్య చేయలేదని వాదిస్తున్నట్లు కోర్టు వ్యాఖ్యానించింది.

మరోవైపు గత సంవత్సరం జనవరి 15వ తేదీన తన లీసెస్టర్ ఆఫీసులో మెడకు గాయాలతో మరణించి ఉన్న వినా పటేల్‌ను భర్త సురేంద్ర, కుమార్తె అనిషాలు గుర్తించారు. ఇదిలా ఉంటే.. వినా పటేల్‌ను ఆమె ఆఫీసు భవనం పై నుంచి కిందికి తోసివేసి, ఆపై దాడి చేసి హత్య చేశారనీ.. అనంతరం దాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించి ఉండవచ్చునంటూ మీడియాలో భిన్న కథనాలు వెలువడుతుండటం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి