ఎన్నారై బారిస్టర్‌ కళ్యాణికి బ్రిటన్‌లో కీలక పదవి

FILE
బ్రిటన్‌లోని ప్రముఖ న్యాయవాదులలో ఒకరిగా పేరుమోసిన ఎన్నారై మహిళ కళ్యాణి కౌల్ (49)కి కీలకమైన న్యాయపదవి లభించింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ కళ్యాణిని "రికార్డర్‌"గా నియమిస్తూ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. కాగా.. ఈ పదవితో కౌల్.. కేసులను విచారణకు సిద్ధం చేయటం, గ్రామీణ ప్రాంత న్యాయస్థానాలలో వాదనలను వినటం, హైకోర్టు ఉప న్యాయమూర్తి హోదాలో ఛాన్సరీకి, హైకోర్టులోని రాణి డివిజన్ బెంచ్‌లకు హాజరవుతారు.

అంతేగాకుండా.. గ్రామీణ న్యాయస్థానాలు లేదా రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్‌లకు కళ్యాణి న్యాయమూర్తిగా వ్యవహరించే అవకాశం కళ్యాణికి కలుగుతుంది. ఇదిలా ఉంటే.. కళ్యాణీ కౌల్ బ్రిటన్‌లోని సుప్రసిద్ధ పాత్రికేయులు మహేంద్ర కౌల్, రజనీకౌల్‌ల కుమార్తె. వీరిద్దరూ వాయిస్ ఆఫ్ అమెరికా, బ్రిటీష్ బ్రాడ్‌క్యాస్టింగ్ ఏజెన్సీలలో సుదీర్ఘకాలం పనిచేశారు.

ఇక కళ్యాణి విషయానికి వస్తే.. ఆమె బ్రిటన్‌లో ప్రముఖ న్యాయవాదిగా పేరుగాంచారు. తీవ్ర నేరాల కేసులలో కూడా ఆమె నిపుణురాలిగా ప్రఖ్యాతిగాంచారు. రువాండా ప్రభుత్వానికి, మున్యుయనెజాకు మధ్య యుద్ధ నేరస్తుడి అప్పగింత కేసు, 2005లో జరిగిన చౌహాన్ కుటుంబం కిడ్నాప్, హత్యల కేసు, బచ్చన్ కౌర్ అత్వాల్ కేసు లాంటి పలు సంచలనాత్మక కేసులను వాదించిన కళ్యాణి, ప్రస్తుతం బ్రిటన్ మహిళా న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి