భారత "మహిళా బిల్లు" ఆఫ్రికాకు ఆదర్శం: టెట్టెహ్

FILE
భారత ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఆఫ్రికా దేశం ఆదర్శంగా తీసుకుందని.. ఘనా ట్రేడ్ మరియు పరిశ్రమల శాఖా మంత్రి హన్నహ్ టెట్టెహ్ సోమవారం వ్యాఖ్యానించారు. చట్టసభలలో పురుషులతో సమానంగా మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో భారత్ ప్రవేశపెట్టిన మహిళా బిల్లు ప్రపంచంలోని మహిళలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు.

దక్షిణాఫ్రికా దేశంలో ఉన్న ఏడుగురు మహిళా మంత్రులలో ఒకరైన టెట్టెహ్ మాట్లాడుతూ... భారత మహిళా బిల్లు ఆఫ్రికాతో కలిపి ప్రపంచంలోని ఎన్నో దేశాల మహిళలకు ఆదర్శనీయంగా నిలిచిందని పేర్కొన్నారు. ఇదే సందర్భంగా మహిళా బిల్లు ఫలవంతం కావాలని ఆకాంక్షించిన ఆమె, భారత్-ఆఫ్రికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత దృఢతరం కావాలని కోరుకున్నారు.

అదే విధంగా భారత్‌లోని పంచాయితీ రాజ్ వ్యవస్థను కూడా మెచ్చుకున్న టెట్టెహ్.. ఈ విషయంలో భారత్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పుకొచ్చారు. అంతేగాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను దృఢతరం చేసే అంశంలో భారత్ నుంచి తగిన సలహాలను సూచనలను కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా.. టెట్టెహ్, ఘనా దేశం తరపున జెండర్ మరియు చిల్డ్రన్ తదితర అంశాలలో మైనారిటీ వర్గాల అధికార ప్రతినిధిగా కూడా సేవలు అందిస్తుండటం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి