ఒలింపిక్ ట్వంటీ20కి యూనిస్ మద్దతు

బుధవారం, 6 ఆగస్టు 2008 (14:43 IST)
ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ ట్వంటీ20కి చోటివ్వాలని పాకిస్థాన్ కెప్టెన్ షోయబ్ మాలిక్, మాజీ సారథి యూనిస్ ఖాన్‌లు మద్దతు పలికారు. ట్వంటీ20కి చోటుపై ఆస్ట్రేలియా మాజీ కీపర్, ఓపెనర్ ఆడం గిల్‌క్రిస్ట్ మొదటగా మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెంగాల్ టైగర్, భారత జట్టు మాజీ కెప్టెన్, ఓపెనర్ సౌరవ్ గంగూలీ, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వాలు ఈ జాబితాలో చేరారు.

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా ఒలింపిక్స్‌లో ట్వంటీ20 క్రికెట్‌కు చోటు కల్పించే దానిపై కృషి జరుపుతుంది. ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆటకు స్థానం 2012 లండన్ ఒలింపిక్స్ లేదా 2016 విశ్వ క్రీడల్లో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా తిలకించే ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు స్థానం దక్కడం ఎంతో సముచితమని షోయబ్ మాలిక్ చెప్పారు. ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ ఆడటం తనకు ఎంతో గొప్పగా ఉంటుందన్నారు. క్రికెట్ చేరికపై ఐసీసీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలు కృషి జరపాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రపంచంలో ఎక్కువ ప్రేక్షకాదారణ కలిగిన పోటీల్లో క్రికెట్ ఒకటని యూనిస్ ఖాన్ చెప్పారు. ఒలింపిక్‌లో క్రికెట్‌కు చోటు దక్కాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రాధాన్యతను వివరించారు. క్రికెట్‌లో భాగంగా 50 ఓవర్ల మ్యాచ్ లేదా ట్వంటీ20 కాని చోటుదక్కితే క్రీడాభిమానుల ఆనందానికి అంతులేకుండా పోతుందని యూనిస్ అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి