పద్మనాభ ఆలయం ఆరో నేలమాళిగను తెరిస్తే అంతే సంగతులు!

బుధవారం, 6 జులై 2011 (20:20 IST)
FILE
సుప్రసిద్ధ ఆలయాల్లో మిరుమిట్లు గొలిపే నిధి నిక్షేపాలుంటాయని తెలిపే ఎన్నో కథలు వినివుంటాం. ఆ నిక్షేపాలను తవ్వేటప్పుడు అపశకునాలు, మృత్యువు సంభవించడం వంటివి ఎన్నో సినిమాల్లో చూసివుంటాం. ఇదే తరహాలో తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలంయంలోనూ, మన రాష్ట్రంలోని అహోబిల స్వామి ఆలయంలోనూ చోటు చేసుకున్నాయంటే నమ్ముతారా.. నమ్మి తీరాల్సిందే.

శ్రీ అనంత పద్మనాభ ఆలయంలో భారీ నిధి నిక్షేపాలు బయటపడిన సంగతి తెలిసిందే. బయటపడిన సంపదలో 18 అడుగుల నెక్లెస్ కూడా ఉంది. 536 కిలోల బరువు గల బంగారం నాణేలు బయటపడ్డాయి. వజ్రాలు పొదిగిన ప్లేటు, వెండి, బంగార పాత్రలు, అద్భుత దీప సౌందర్యం, పోతపోసిన బంగారం వస్తువులు ఉన్నాయి. అత్యద్భుతమైన ప్రాచీన, సంప్రదాయ వస్తువులు వెలుగు చూశాయి.

అయితే తిరువనంతపురంలోని 16వ శతాబ్దపు శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఇంకా తాళం వేసి ఉన్న ఏకైక నేలమాళిగను తెరిస్తే అంతే సంగతులని ఆలయానికి చెందిన రాజు వంశీయులు చెపుతున్నారు. ఆరో నేలమాళిగను తెరిస్తే రాష్ట్రానికి అపశకునాలు తప్పవట. దానిని తెరవడం ద్వారా దురదృష్టాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుందనే మాట అందరి నోట వినిపిస్తోంది.

150కి పైగా ఏళ్ల అనంతరం ఆలయంలో తెరిచిన నేలమాళిగలలో ఒక దానిలో దిగ్భ్రాంతికర స్థాయిలో మణిమాణిక్యాలు, వజ్రాలు, దైవ ప్రతిమలు, ప్రాచీన కాలపు బంగారు నాణాలు కనిపించాయి. వాటి విలువ రూ.లక్ష కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. అయితే పద్మనాభ పవిత్ర ఆలయంలో ఉత్కంఠకు గురిచేసే తాళం వేసి ఉన్న మాళిగ ఇంకా ఒకటి ఉంది.

ఆలయంపై అజమాయిషీ వహిస్తున్న రాజకుటుంబం సమాచారం ప్రకారం, చాంబర్‌ బిని తెరవడం రాష్ట్రానికి, ఆ పని చేసిన వారికి అపశకునం కావచ్చు. ఆలయం గురించి, దాని సంప్రదాయాల గురించి సుప్రీం కోర్టుకు వివరించేందుకు రాజ కుటుంబ సభ్యుడు ఒకరు ఈ వారంలో ఢిల్లీ వెళ్లవచ్చని సమాచారం. ఇప్పటికే కమిటీ సభ్యులలో ఒకరి కాలికి గాయం కాగా మరొక సభ్యుని తల్లి అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు.

మరి ఆలయం నిధి నిక్షేపాల జాబితా రూపకల్పన నిమిత్తం సుప్రీం కోర్టు నియమించిన ఏడుగురు సభ్యు కమిటీ ఆ రహస్య ‘చాంబర్‌ బి’ని తెరుస్తుందా అనేది ధర్మ సందేహంగా మారింది.

మరోవైపు రాష్ట్రంలోని అహోబిల నరసింహ స్వామి ఆలయం ప్రసిద్ధి కెక్కెలా కనిపిస్తోంది. క్రూరమృగాలు సంచరించే దట్టమైన అడవుల్లో కొలువైవున్న అహోబిలంలో అపూర్వ సంపద దాగి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సంపదకు అహోబిల స్వామి భద్రత కల్పిస్తున్నారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నిధిని ఆలయంలోని ప్రాంతంలో దాచి, శ్రీకృష్ణ దేవరాయలు కూడా జీవసమాధి అయినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సంపదను వెలిసి తీసి భద్రపరచాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కానీ 1962వ సంవత్సరంలో అహోబిలంలోని నిధిని దొంగలించేందుకు వచ్చిన దొంగలు తేనెటీగలు కుట్టి మరణించారని ఆలయ అధికారులు చెబుతున్నారు. అలాగే 1992లో నిధిని వెలికి తీసేందుకు ప్రయత్నించిన ఓ ప్రొఫెసర్ కారు ప్రమాదంలో మృతి చెందారు. అయితే అహోబిలంలోని ఖజానాకు ప్రత్యేక మ్యాప్ ఉందనీ, అదేసమయంలో స్వామి వారి నిధిని బయటికి తీయడం శాస్త్ర విరుద్ధమని హిందుత్వ వాదులు హెచ్చరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి