2018 మేషరాశి వారి ఫలితాలు ఇలా వున్నాయి...

గురువారం, 28 డిశెంబరు 2017 (11:57 IST)
అధికమాస ఫలితము 
విద్వరం భూమిపాద్భీతిః తస్కరాది భయంభవేత్ ఘృతం తైలం తధా ధ్యానం సుమర్ఘం స్యాద్ద్వి జ్యేష్ఠకే జ్యేష్టమాసము అధికమాసం అయిన యెడల ఆ సంవత్సరం అంతా రాజు వలన ప్రజలకు భయము, సంఘంలో చోరభయము, అగ్నిబాధలు, నెయ్యి, నూనె, ఆహార ధాన్యములు ధరలు కొంత పెరిగి అదే స్థాయిలో ఉండును. రాజయుద్ధము సస్యనాశము కూడా చెప్పబడినది. జ్యేష్ఠద్వయే నృపధ్వం సోధాన్యా నిక్షతిసత్తమే."
 
మేషరాశి: అశ్వని 1, 2, 3, 4 పాదములు (చూ, చే, చో, లా) భరణి 1, 2, 3, 4 పాదములు (లీ, లూ, లే, లో) కృత్తిక 1వ పాదం (ఆ). ఆదాయం-2, వ్యయం -14, పూజ్యిత-5, అవమానం-7.
 
ఈ రాశివారికి ఈ సంవత్సరం అక్టోబర్ వరకు సప్తమం నందు బృహస్పతి ఆ తదుపరి అంతా అష్టమము నందు ఈ సంవత్సరం అంతా భాగ్యము నందు శని, ఈ సంవత్సరం అంతా చతుర్థము నందు రాహువు, రాజ్యము నందు కేతువు సంచరిస్తారు. ఈ సంవత్సరం మీ గోచారం పరిశీలింపగా ''న బుద్ధిర్ధన లాభాయ న జాడ్యమసవృద్ధమే' తెలివితేటలున్నంత మాత్రాన కలిమీ కలగదు అన్న వాస్తవాన్ని గుర్తిస్తారు ఈ సంవత్సరం గురువు అనుకూలం కొంత తక్కువనే చెప్పవచ్చు. కాబట్టి ఉన్నత భావాలతో ముందుకు సాగే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం ఏదైనప్పటికీ అసంతృప్తి, అశాంతికి లోనవుతారనే చెప్పవచ్చు. శని సంచారం సాధారణస్థాయిలో ఉంది. ఇతరుల మాటలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ధైర్యంతో మందుకు సాగండి. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉండటం వల్ల ఒకింత ఆందోళన తప్పదు.
 
శని సంచారం ద్వారా నష్టాలు రావుగానీ, రాహువు, కేతువు వల్ల ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే ఆస్కారం ఉంది. ఎప్పటినుంచో వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో అతికష్టం మీద పూర్తి చేస్తారు. గృహనిర్మాణ యత్నాలు ఫలిస్తాయి. ముఖ్యుల పట్ల ఆరాధన పెరుగుతుంది. ఉద్యోగులు అధిక శ్రమానంతరమే సత్ఫలితాలు పొందుతారు. అధికారులకు అనుగుణంగా నడుచుకుంటారు. సహోద్యోగుల సహకారం వీరికి అందుతుంది. అయితే ఆరోగ్యంపై దృష్టి వుంచండి. 
 
కాళ్ళు, నడుము, నరాలు, జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. ఏమాత్రం ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. రాజకీయాల్లో వారికి అనుకోని పదవులు లభించే ఆస్కారం ఉంది. ఎత్తులకు పై ఎత్తులు వేసి ప్రత్యర్థులను చిత్తుగా ఓడిస్తారు. అవివాహితుల్లో నూతనోత్సాహం నెలకొంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు ఆందోళన ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికి అధిక శ్రమానంతరమే సత్ఫలితాలు పొందుతారు. కళా, క్రీడా రంగాల్లో వారికి అనుకోని అవకాశాలు లభిస్తాయి. ఎటువంటి అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోవటం మంచిది. ముఖ్యులకు తొందరపడి ఇతరులకు మాట ఇవ్వకండి. స్నేహితులే శత్రువులు అయ్యే ప్రమాదం వుంది. 
 
సమస్యల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించండి. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్, రవాణా రంగాల్లో వారికి కలసిరాగలదు. కుటుంబీకుల మధ్య చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. శుభకార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. వృత్తి వ్యాపారులు సాధారణ ఫలితాలు పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించే ముందు ఆచి, తూచి వ్యవహరించండి. అక్టోబర్ 11 నుంచి సానుకూల ఫలితాలు అందుతాయి. రావలసిన ధనం కొంత అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. 
ఫ్యాన్సీ, కిరణా, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో వారికి కొంత ఊరట కలుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నూతన వెంచర్లు ప్రారంభిస్తారు. తమ తెలివితేటలతో చాకచక్యంతో ముందుకు సాగిన సత్ఫలితాలు ఉంటాయి. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. షేర్ వ్యాపారస్తులకు తొందరపాటు మంచిది కాదు. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన వల్ల మానసిక ప్రశాంతత నెలకొంటుంది. నిరుద్యోగులు ఊహించిన వానికంటే మంచి అవకాశాలు పొందుతారు.
 
* ఈ రాశివారు దక్షిణామూర్తిని ఆరాధించి, కుబేరుని పూజించినట్లైతే సంకల్పసిద్ధి, మనోసిద్ధి చేకూరుతుంది. 
* అశ్వని నక్షత్రం వారు 'జీడిమామిడి', భరణి నక్షత్రం వారు 'దేవదారు', కృత్తికనక్షత్రం వారు 'అత్తి' చెట్టును నాటిన సర్వదోషాలు తొలగిపోతాయి. 
* అశ్వని నక్షత్రం వారు 'కృష్ణవైఢూర్యం', భరణి నక్షత్రం వారు 'వజ్రం', కృత్తికా నక్షత్రం వారు 'కెంపు' ధరించిన శుభదాయకంగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు