పుట్టిన రోజును కేక్ కట్ చేసి జరుపుకోవడం కాదు.. ఆ రోజు చేసే దానాలు వారికి పుణ్య ఫలితాలను ఇస్తాయి. పేదలకు దానం చేయడం ద్వారా సంతృప్తి కలుగుతుంది. అలాగే పుట్టిన రోజున అన్నదానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. అలాగే బర్త్ డే రోజున పరమేశ్వరునికి రుద్రాభిషేకం ఇంటగానీ, ఆలయంలో కానీ చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. కీర్తి, ప్రతిష్టలను పెంపొందిస్తుంది.
ఇంకా పుట్టిన రోజున తీరిక వుంటే లలిత సహస్రనామం, విష్ణుసహస్రనామం పారాయణం చేయడం ద్వారా పుణ్య ఫలితాలను పొందవచ్చు. ఇంతే కాకుండా గ్రహచరాదులు వలన అపమృత్యు దోషం ప్రాప్తి అయినప్పుడు మృత్యుంజయ హోమం శ్రేయస్సుని ఇస్తుంది.
ఉదయాన్నే నువ్వుల నూనెతో తలంటుకుని తల స్నానం చేసి, నూతన వస్త్రధారణ, రక్షా తిలకం ధరించడం.. ఇంట్లో గల పూజ గదిలో పూజ చేసి... పంచ హారతులు ఇవ్వడం ద్వారా అరిష్టాలు తొలగిపోతాయి.
పసిపిల్లలైతే ఏడాది పూర్తయ్యేంతవరకు ప్రతి మాసంలో జన్మతిథి నాడు జన్మదినాన్ని చేయాలి. ఆ తర్వాత ప్రతి ఏడాది జన్మతిథి నాడు జన్మదినం జరపాలి. ఇలా చేస్తే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.