కార్తీకంలో ఉపవాసం ప్రధాన నియమంగా చెప్పబడింది. పగలు ఉపవసించి, రాత్రి భోజనం చేయడం మంచిది. పగలంతా ఉపవాసం చేయలేని వారు పాలు, పండ్లు, అల్పాహారం తీసుకోవచ్చు. కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. కార్తీక దీపాలను దేవాలయాలు, మఠాలయందు సూర్యోదయానికి ముందు, సాయం సంధ్యా సమయంలోనూ వెలిగించాలి.
ఇంటి ముంగిట, ఇంటిలోను తులసీ కోటవద్ద దీపాలను వెలిగించాలి. కార్తీక మాసంలో దీపారాధన వల్ల కష్టాలు తొలగి ఐశ్వర్యం లభిస్తుంది. దీపదానం కూడాఎంతో ఫలదాయకం. దీపాన్ని ఉసిరికాయ మీద ఉంచి దానంగా ఇవ్వాలని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకంలో చేయబడే దాన ధర్మాలు విశేష ఫలితాన్ని ఇస్తాయి. అందుకే శక్తి కొలది దానాలను చేయడం ఎంతో ముఖ్యం.
కార్తీకమాసంలో సోమవారం పరమేశుడికి ఎంతో ప్రీతికరం. అందుకే పగలంతా ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో అంటే సాయంకాలం శివుడిని శక్తికొలది అభిషేకించి, బిల్వదళాలతో అర్చించాలి. రాత్రి జాగరణ చేసి మరుసటి రోజు ఉదయం తిరిగి శివున్ని పూజించి అన్నదానం చేయడం వ్రత నియమంగా చెప్పబడుతోంది