నవగ్రహాలకు రారాజు.. సూర్యుడిని పూజిస్తే?

శనివారం, 12 జులై 2014 (18:38 IST)
సూర్యుడు మగ జాతకంలో బలం పొంది ఉంటే వారు గొప్ప మగసిరి కలిగి ఉంటారు. మహిళ జాతకంలో బలం కలిగి ఉంటే ఆమె శీలవతి కాగలదు. సూర్యుడు సాత్విక గుణం కలిగి ఉన్నందున సూర్య బలం కలిగిఉండే జాతకులకు రాజుకు సమాన హోదా కలిగిన జీవితం లభించగలదు. గౌరవం, శక్తియుక్తులు, ధైర్య సాహసాలు, సత్ప్రవర్తన, పలుకుబడి, ప్రభుత్వాధికారుల మద్దతు లభిస్తుంది. 
 
సూర్యుడు అంటే తేజస్సు. చామంతి వర్ణంలో ఉండే సూర్యుడ్ని చీకటికి ప్రథమ శత్రువని కూడా అంటారు. కాస్యప ముని కుమారుడైన సూర్యుడిని వారం మొదటి రోజున పూజిస్తుంటారు. రవి, దివాకరుడు, భాస్కరుడు, ఆదిత్యుడు, భానుడు అని వేర్వేరు పేర్లతో ఆయనను సంబోధిస్తున్నారు. అగ్నిదేవతను తనలో కలిగి స్వీయ ప్రకాశ శక్తిని నింపుకున్న సూర్యుడిని ప్రతినిత్యం సూర్య నమస్కారంతో పూజించే వారికి ఆరోగ్యం, ఆత్మబలం మెరుగుపడగలదని భక్తుల విశ్వాసం. 
 
పాప గ్రహంగా కొందరు చెబుతున్నప్పటికీ, నవగ్రహాలకు ఆయనే రాజుగా వెలుగొందుతున్నాడు. అంతేకాక ఆయన ద్వారానే జన్మలగ్నాన్ని లెక్కిస్తున్నారు. సూర్యుడు పితృకారకుడుగా ఉంటున్నారు. సూర్యుడు తొమ్మిదో స్థానంలోఉంటే పిత్రార్జిత ఆస్తులు వెంటనే చేతికందగలవు. అంతేకాక ఈ జాతకుడి తండ్రికి సైతం మంచి జరుగుతుంది. సూర్యుడు, శుక్రుడు మంచి స్థానాలలో ఉంటే ఆ జాతకుడికి వస్తు, కనక, గృహ రూపంలో ఆస్తులు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి