గరికకు.. సూర్య గ్రహణానికి సంబంధం ఏమిటి..?: రేపొక్క రోజుకి టీ, కాఫీలు తాగొద్దు!

మంగళవారం, 8 మార్చి 2016 (13:39 IST)
సూర్య గ్రహణం లేదా చంద్రగ్రహణం సమయంలో గరికను ఆహార పదార్థాల్లో, ధాన్యాల్లో వేసి వుంచడం మనం గమనిస్తుంటాం. అయితే గరికను గ్రహణం సమయంలో ధాన్యాలు, ఆహార పదార్థాలకు చెందిన పాత్రలపై ఎందుకు ఉంచుతారనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

గ్రహణం సమయంలో భూమి మీదకు ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల్లాంటివి ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో ఈ పని చేయకూడదని, ఆహార పదార్థాలు ముట్టకూడదని పెద్దలు అంటారు. దాదాపు అన్ని ఆలయాలు మూసివేస్తారు. గ్రహణం విడిచాక ఆలయాలన్నీ... గృహాలన్నీ సంప్రోక్షణ చేయడానికి గల కారణాలు కూడా ఆ కిరణాల విషప్రభావాన్ని తొలగించడానికేనని పండితులు అంటున్నారు. 
 
ఈ క్రమంలో గరికను కూడా ఆహార పదార్థాలు, ధాన్యాల్లో ఉంచుతారు. గరిక అనేది యాంటీ రేడియేషన్ గుణాలు కలిగివున్నది. అందుకే గ్రహణం సమయంలో  మన ఇంట్లోని అన్ని పాత్రలపై, నీటి ట్యాంకులపై వీటిని ఉంచడం వలన రేడియేషన్ ప్రభావాన్ని కొంచెం తప్పించుకోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక ఈ గ్రహణ సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్ళకపోతే మంచిది.
 
ఇకపోతే.. మన దేశంలో సూర్య చంద్ర గ్రహణాలపై పలు భయాలున్నాయి. ఈ గ్రహణాల వల్ల గర్భస్థ శిశువులకు హాని జరుగుతుందని భావిస్తారు. గ్రహణం రోజున బయట తిరిగితే అరిష్టమని స్త్రీలు ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే కడుపుతో ఉన్నవారిని ఇంట్లోనే ఉంచుతారు. గ్రహణం ఉన్నంతసేపు వీరిని బయటికి రానివ్వరు. నిద్రపోనివ్వరు. ఇంట్లోనే మెల్లిగా నడవమని చెబుతుంటారు.
 
గర్భం ధరించిన స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటికే పరిమితమవ్వడం మంచిదని, అంతేగాక తమ నివాస గృహాలలో ఆ సమయంలో సూర్యుడి ఛాయలు పడకుండా జాగ్రత్తపడాలని వారంటున్నారు. గ్రహణ సమయంలో ప్రసరించే అతినీలలోహిత కిరణాలు గర్భిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పండితులు హెచ్చరించారు. గ్రహణం ఏర్పడటానికి మూడు గంటల ముందు, ఏర్పడిన అనంతరం మరో మూడు గంటల వరకు పసి పిల్లలు, వృద్ధులు ఎలాంటి ఆహారం తీసుకోకూడదని, యుక్తవయస్కులు మాత్రం గ్రహణ సమయానికి 12 గంటల ముందు ఆహారాన్ని తీసుకోవాలని వారు స్పష్టం చేశారు.
 
అలాగే, గ్రహణం రోజున ముందుగా వండిన పదార్థాలను కూడా పారవేస్తారు. అన్ని దేవాలయాలనూ మూసివేస్తారు. దోష నివారణకు ప్రత్యేక పూజలు చేస్తారు. గ్రహణాల సమయంలో ముస్లింలు కూడా సలాతుల్-కుసుఫ్ అనే ప్రత్యేక ప్రార్థన చేస్తారు. 
    
గ్రహణం పట్టే ముందుగా స్నానం చేసి జపం చేసుకుని గ్రహణానంతరం మరలా స్నానం చేసి మీ ఇంటి లోనున్న పూజా గృహాన్ని శుద్ధి చేసుకుని పటాలు లేక విగ్రహాలను కూడా ఆవుపాలు శుద్ధ జలంతో శుద్ధిపరచుకుని వారికి ఉపచారాదులు  చేసుకోవాలి. తదనంతరం మాత్రమే ఏదైనా స్వీకరించాలి. పొద్దుటే టీ- కాఫీలు త్రాగేవారు రేపొద్దున్న ఒక్కపూట ఆ అలవాటుకు మానుకోవటం మంచిది.

వెబ్దునియా పై చదవండి