ఆడవారికి మనోబలం అధికం. ఎటువంటి కష్టాన్నైనా తట్టుకోగలరు. "ఆడపిల్లలా ఏడుస్తున్నాడు" అంటూ ఏడ్చే మగవారిని గేలి చేస్తారు. కాని హాయిగా ఏడవగలగటమే ఆడవారికి శక్తి. తమ కష్టాన్ని చెప్పుకుని బరువు దించుకోలేకపోవటమే పురుషుడి బలహీనత.
కష్టమైనా, సుఖమైనా ఆడవారు ఇట్టే బహిర్గతం చేస్తారు. కష్టమైతే ఏడ్చి గుండెల్లోని బాధను వదిలించుకుంటారు. మగవారు అలా కాదు. బాధను అదిమిపెట్టుకుని, దాన్ని ఎలా దిగమింగాలో లేక ఎలా వదిలించుకోవాలో తెలియక సతమతమై చివరికి ఆత్మహత్యకు పాల్పడతారు.
మధ్య వయసులో ఆత్మహత్యల శాతం పురుషులలోమే చాలా ఎక్కువ. ఆడవారికన్నా మగవారిలో ఆత్మహత్యలు తొమ్మిది శాతం అధికం. తమ తప్పులను తట్టుకోలేక ప్రాణాలు తీసుకునేవారు కొందరైతే, తమవారి తప్పుల్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకునే వారు కొందరు.
మనసు దిటవు చేసుకుని బతకటం మగవాడికి తెలియదు. వ్యతిరేక పరిస్థితులు ఎదురవగానే స్త్రీ, పురుషుల స్పందన భిన్నంగా ఉంటుంది. అటువంటి సమయంలో స్త్రీ వెనువెంటనే స్పందించకపోయినా ఒకసారి పరిస్థితులు ఆకళింపు చేసుకున్న తర్వాత ఇంక రాటుదేలుతుంది. కష్టమైనా, నష్టమైనా భరించగలిగిన మానసిక స్థితికి చేరి కొత్త ఎత్తులు, ఎత్తుగడలు వేస్తుంది. అందుకే ఆమె ఆయుర్దాయానికి ఢోకా ఉండదు.
పురుషుడు ఇందుకు పూర్తిగా భిన్నం. బాధ్యత తీసుకోలేడు. తన మీద తనకే సందేహం. అందుకే క్రమంగా కుంగి అనారోగ్యాల పాలవుతాడు. వ్యతిరేక ఫలితాలు ఎదురైనప్పుడు బి.పి, షుగర్ బయటపడటం పురుషుల్లో కనిపిస్తుంది. వాటి ప్రభావం గుండె, మూత్రపిండాలమీద పడి ప్రాణాలు హరిస్తాయి. ఇది ఆడవారిలో కనపడదు. అందుకే మగవారికి మగతనం శాపంగానూ, ఆడవారికి ఆడతనం శ్రీ రామరక్షగా తయారైంది.