ఇంటర్నెట్‌లో ఛాటింగ్ చేస్తున్నారా... అమ్మాయిలూ జాగ్రత..!

బుధవారం, 11 ఫిబ్రవరి 2015 (16:03 IST)
ఇంటర్‌నెట్, ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక సైట్లూ, నిత్యం వాడే ఈమెయిళ్లతో ఈతరం అమ్మాయిలకు ఇంట్లోనే కావాల్సినంత కాలక్షేపం, సమాచారం అందుతుంది. ఇలాంటి సైట్లలో సభ్యత్వం, తరచూ ఆన్ లైన్ స్నేహితులతో చాటింగ్ చేయడం మంచిదే. కానీ కొన్ని జాగ్రత్తలు అవసరం. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందుల్లో పడాల్సిందే. 
 
ఆన్‌లైన్‌లో ఉన్నప్పడు మీరేం పోస్టు చేస్తున్నారనేది ముందు గమనించుకోండి. అది పోస్టు చేయడానికి తగినదేనా కాదా అన్నదీ నిర్ధరించుకోండి. ఇతరులతో ముఖ్యంగా అబ్బాయిలతో స్నేహంగా కలిసి దిగిన ఫోటోలు సామాజిక సైట్లలో పెట్టే ముందూ, ఈమెయిల్ ద్వారా పంపే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అవి మీకు లైక్‌లు, మంచి కామెంట్లు తెచ్చి పెట్టొచ్చు. అయితే భవిష్యత్‌లో వాటివల్లే సమస్యలు ఎదురుకావచ్చని గమనించాలి. మీరు స్నేహితులుగా భావించిన వాళ్ళే దాన్ని అవకాశంగా మార్చుకుని మిమ్మల్ని ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేయొచ్చని గుర్తుంచుకోండి.
 
చాటింగ్ చేస్తున్నప్పుడు స్నేహంగా లేదా మరికొంత సన్నిహితంగా వాక్యాలు చూసినప్పుడు కొంత ఆనందం కలగడం సహజమే. అయినా వాటిని తేలిగ్గా తీసుకోరాదు. అటవంటి వాటిని వీలైనంత వరకు పొడిగించకుండా ఉండడం మేలు. ఇంకా కొందరు చిరునామాలు, ఫోన్‌నెంబర్లు వంటివి అడుగుతుంటారు. వాటిని ఇవ్వకపోవడం మంచిది.

ఒక వేల నేరుగా కలవాలనుకుంటే ఒంటరిగా కాకుండా మరొకరిని వెంటబెట్టుకుని వెళ్ళడం మంచిది. అది కూడా జన సంచారం అధికంగా ఉండే ప్రాంతంగా చూసుకోవాలి. ఈ విషయాన్ని తప్పని సరిగా కన్నవారితో చెప్పడం ఎంతైనా అవసరం.

వెబ్దునియా పై చదవండి