ఏం చేస్తున్నాం.. ఏం మాట్లాడుతున్నామో తెలుసుకోండి!

శుక్రవారం, 15 మే 2015 (17:20 IST)
అనుకున్నదే తడవుగా, మనస్సులోకి ఆలోచన వచ్చీరాగానే ఆ పనిని పూర్తి చేసేయాలని తహతహలాడేవారా మీరు.. అయితే ఈ కథనాన్ని చదవండి. ఈ మనస్సులోకి ఆలోచన వచ్చిందే తడవుగా పనులు పూర్తిచేయాలనే తొందరలో వారికి పనితాలూకూ ఫలితాల ఆలోచనకాని, మంచి చెడుల సమీక్షకాని అస్సలు ఉండదు. ఎవరేమనుకుంటే నాకేంటి, నా పని నాకు ముఖ్యం అన్న ధోరణిలో పడిపోయి, ఇందుకోసం తాము ఎందర్నో ఇబ్బందిపెడుతున్నామన్న స్పృహే వుండదు. ఈ తత్త్వం సహన లేమికి తొలిసూచన. 
 
ఒక ఆలోచన రాగానే అది ముగించాలన్న ఒకేఒక్క దృక్పథం మినహా, రెండో ఆలోచనని రానివ్వని ఈ వైఖరి సంబంధితులను విసుగు పుట్టిస్తుంది. మన పనికి తాలుకూ ఒత్తిడిని సహాయం కోసం అభ్యర్థించేవారిపై ఎంతవరకు రుద్దుతున్నామన్న విచక్షణ అవసరం.

ఈ విచక్షణ లేకపోవడం వల్ల మానసిక ఆందోళన, ఆతృతలు ఎక్కువవుతాయి. ఏం చేస్తున్నాం. ఏం మాట్లాడుతున్నాం అన్న ఆలోచన నశిస్తుంది. ఏ పని ఆరంభించడానికైనా ఆలోచన అవసరం. విచక్షణతో కూడిన పనులు వివేకాన్ని పెంచుతాయి. ఆ వివేకం తాలూకూ పరిమళాలు ఎల్లవేళలా వెన్నంటే వుంటాయి.

వెబ్దునియా పై చదవండి