తమ జాతి సంప్రదాయాలకు అనుగుణమైన దుస్తులను మాత్రమే ధరించే పిల్లలు మానసిక సమస్యలకు దూరంగా ఉంటున్నట్టు తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. తూర్పు లండన్ పాఠశాల నుంచి 11-14 సంవత్సరాల ప్రాయంలోని బ్రిటిష్, బంగ్లాదేశ్ పిల్లలను ఆధారంగా చేసుకున్న ఈ సర్వే తమ జాతికి చెందిన స్నేహితులు, దుస్తులు లేదా ఇతర జాతులతో పిల్లల సాంస్కృతిక మూలాల గుర్తింపును అంచనావేసింది.
నేటి కాలంలో యువత ప్రత్యేకించి మానసిక సమస్యలకు గురవుతోందని, వారి సాంస్కృతిక గుర్తింపు ప్రధానంగా దుస్తులు మరియు స్నేహాల ఎంపికతో ముడిపడి ఉందని వీరు పేర్కొంటున్నారు. ఏదైనా బహుళ సంస్కృతీ సమాజంలో జీవిస్తున్న యువతకు సాంస్కృతిక సమైక్యత అత్యంత ఆరోగ్యకరమైన అంశంగా ఉంటుందని ఈ పరిశోధకులు స్పష్టం చేశారు.
అయితే ఇలాంటి సమాజాల్లో జీవనశైలి, ప్రవృత్తులు లేదా ప్రవర్తలు వంటి అంశాలను మార్చుకోవడం అనేదే బాగా వత్తిళ్లకు గురిచేస్తూంటుందని వీరి భావన. కాబట్టి చక్కటి మానసికారోగ్యం కావాలంటే వస్త్రధారణ రూపంలో సాంస్కృతిక గుర్తింపును అట్టిపెట్టుకోవడం చాలా ముఖ్యమని ఈ పరిశోధన తెలుపుతోంది.