ప్రస్తుతం జీవితం ఉరుకులు పరుగులమయమై పోతోంది. ఈ నేపథ్యంలో చాలామంది ఒత్తిడికి గురై జబ్బులబారిన పడుతుంటారు. దీంతో మరింత అనారోగ్యానికి గురికాక తప్పడంలేదు. కానీ ఒత్తిడిని దూరంచేసి మనసుని ప్రశాంతంగా ఉంచగలిగితే ఆయుష్షు ప్రమాణాలు పెరుగుతాయని వైద్యులు అంటున్నారు. ఒత్తిడిని అధిగమించడం కంటే నిత్యం సంతోషంగా ఉంటూ తమ పని తాము చేసుకుంటూ పోతుంటే ఎలాంటి జబ్బులు దరి చేరవని వారు చెబుతున్నారు.
ఆడవారి విషయంలో మాత్రం మగవారితో సమానంగా ఆఫీసు పనులు చక్కపెట్టడమే గాకుండా ఇంటి వద్ద మళ్లీ భర్త-పిల్లలకు, అత్త-మామలకు, ఇంటికి వచ్చే అతిథులకు రుచికరమైన ఆహారాన్ని చేసిపెట్టాలి.
అయితే ఆడవారు ఎక్కువగా ఒత్తిడికి గురికాకుండా, తెలివిగా ఇంటిపనులను ప్రణాళికాబద్దంగా చేసుకుంటూపోతే సంతోషంగా జీవితాన్ని గడపవచ్చంటున్నారు పరిశోధకులు. దీంతో వారి ఆయుప్రమాణం పెరుగుతుందని అధ్యయనకారులు చెబుతున్నారు.
కార్యాలయంలో మీరు చేసేపనిని సానుకూల దృక్పథంతో ఆలోచించి చేయాలి. దీంతో ఒత్తిడి ఉండదు. ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు కాస్త ప్రాణవాయువును అధికంగా పీల్చి రిలాక్స్ అయ్యేదానికి ప్రయత్నించండి. మీ పక్కనున్న కొలిగ్‌తో సంభాషణ ప్రారంభించండి. కాసేపు చాయ్ అని మాటల్లో పెట్టండి. దీంతో మీలోనున్న ఒత్తిడి మటుమాయం అంటున్నారు పరిశోధకులు.