సకల జగద్వ్యాపినియైన పరాశక్తిని ఆశ్రయించడం కంటే మోక్షాన్ని కాంక్షించే వాడికి మార్గాంతరం లేదు. సదసదాత్మికమైన ఈ సమస్త సృష్టిని ఆ మహామాయయే నిర్వహిస్తూ ఉంటుంది. హరిహర బ్రహ్మలూ, సూర్యచంద్రులూ, అశ్వినులూ, అష్ట వసువులూ, తష్టా, కుబేరుడూ, వరుణుడూ, వహ్ని, వాయివూ, పూషుడూ, స్యౌనీ, వినాయకుడూ.. వీరందరూ శక్తితో కూడిన వారవడం చేత ఆయా కార్యాలను నిర్వహించగలుగుచున్నారు. లేకపోతే వారు కదలనైనా కదలలేరు. ఆ పరమేశ్వరియే ఈ జగత్తుకు కారణం. అందుకే ఆమెను విధి విహితంగా ఆరాధించాలి. దేవీ యజ్ఞం నిర్వహించాలి.