లక్ష్మీ గవ్వలను పూజా మందిరంలో ఉంచి పూజిస్తే?

గురువారం, 24 జులై 2014 (17:25 IST)
గవ్వలకు చాలా ప్రాధాన్యత ఉండేది. గవ్వలు లేనివాళ్ళు నిరుపేదలు. ఇప్పటికీ బొత్తిగా డబ్బులేదని చెప్పడానికి చిల్లి గవ్వ కూడా లేదు అనడం ఎన్నోసార్లు వినే ఉంటాం. అందుచేత గవ్వలు పవిత్రమైనవి, లక్ష్మితో సమానమైనవి. గవ్వల్లో పసుపు రంగులో మెరిసే గవ్వల్ని లక్ష్మీ గవ్వలు అంటారు. లక్ష్మీ గవ్వలు, లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు.
 
అసలు లక్ష్మీ గవ్వలు ఎక్కడివి, ఎలా వచ్చాయి అనే సందేహం కలుగుతోందా? అయితే ఈ స్టోరీ చదవండి. క్షీర సాగర మధనం సమయంలో అమృతం, హాలాహలంతో పాటు శంఖాలు, లక్ష్మీ గవ్వలు కూడా ఉద్భవించాయట. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరునిగా, గవ్వను సోదరిగా భావిస్తారు. ఆ విధంగా లక్ష్మీ గవ్వలు, లక్ష్మీదేవికి ప్రతిరూపమయ్యాయి.
 
గవ్వను లక్ష్మీదేవి చెల్లెలిగా భావించేవారు కనుక, నాణేలు, రూపాయలు పుట్టకముందు వాటినే కాసులుగా వాడేవారు. ఆర్ధిక లావాదేవీల్లో గవ్వలనే మారకంగా వినియోగించేవారు. అంటే, ఒకప్పుడు డబ్బుకు మారుగా గవ్వలే ఉండేవన్నమాట. ఎవరి దగ్గర ఎక్కువ గవ్వలు ఉంటే వారే ధనవంతులు.
 
లక్ష్మీ గవ్వలు కనుక ఇంట్లో ఉంటే సంపదలు వచ్చిపడతాయి. ధనధాన్యాలు వృద్ది చెందుతాయి. అంటే, గవ్వలకు, లక్ష్మీదేవికి అవినాభావ సంబంధం ఉంది. ఎక్కడ లక్ష్మీ గవ్వలు ఉంటాయో, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే, మన పూర్వీకులు గవ్వలకు అంత ప్రాధాన్యత ఇచ్చారు.
 
అందుకే పూజామందిరంలో లక్ష్మీదేవి విగ్రహంతో పాటు శంఖాన్ని, లక్ష్మీ గవ్వలను కూడా పీఠంపై ఉంచి ప్రార్ధించడం ఆనవాయితీ. అందుచేత లక్ష్మీ గవ్వలను సంపాదించి పూజామందిరంలో పూజించే వారికి సిరిసంపదలను వెల్లివిరుస్తాయి.

వెబ్దునియా పై చదవండి